మోహినీ అవతారంలో నారసింహుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బు«ధవారం రాత్రి మోహినీ అవతారమెత్తారు. తమ ఇలవేల్పు నృసింహుని కనులారా దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘మోహినీ అవతారంలో స్వామి వారి కుచ్చుల వాలుజడ భలే ఉందే...’ అంటూ భక్తులు ఒకరినొకరు చెప్పుకున్నారు. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తాడని భక్తుల విశ్వాసం. దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి, అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు ఈ అవతారమెత్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.
వయ్యారాలు ఒలకపోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు. ధగధగా మెరిసే పట్టు చీరలో అందరినీ అకట్టుకునే స్వామి వారిని గుభాళించే కదిరి మల్లెలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం బ్రహ్మకుమారీలు చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నరసింహావతారాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. ఆర్డీఓ వెంకటేశు, ఈఓ వెంకటేశ్వరరెడ్డిలు జ్యోతి వెలిగించి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు.
నేడు పట్టణమంతా ఊరేగనున్న శ్రీవారు :
తిరు వీధుల దర్శనానంతరం శ్రీవారు రాత్రంతా పట్టణంలోని ప్రతి వీధికి వెళ్లి ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిచ్చారు. అదేవిధంగా గురువారం పగలు సైతం పట్టణమంతా తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని ప్రజా గరుడ సేవతో మళ్లీ తిరువీధుల్లో దర్శనమిస్తారు. మోహినీ ఉత్సవ ఉభయదారులుగా కోటా వెంకటక్రిష్ణమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మెన్ నరేంద్రబాబు తెలిపారు. డీఎస్పీ వెంకటరామాంజనేయులు, సీఐ శ్రీనివాసులుతోపాటు డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.