నమో నారసింహా.. | rathothsavam in kadiri | Sakshi
Sakshi News home page

నమో నారసింహా..

Published Sat, Mar 18 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

నమో నారసింహా..

నమో నారసింహా..

- అంగరంగ వైభవంగా ఖాద్రీ నృసింహుని బ్రహ్మ రథోత్సవం
- భక్తజన సంద్రమైన కదిరి పట్టణం
- శ్రీవారిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు
- కేవలం 4 గంటల్లో యథాస్థానం చేరిన బ్రహ్మరథం


కదిరి : శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాలతో పాటు కర్ణాటక నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కదిరి పట్టణమంతా భక్తులతో నిండిపోయింది. వారి గోవింద నామస్మరణతో మార్మోగింది.  బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీ నారసింహుడు తిరు వీధుల గుండా విహరించేందుకు దేవతలు ప్రతిరోజు ఒక్కో వాహనాన్ని పంపుతారు. బ్రహ్మ రథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మ దేవుడే రథాన్ని నడుపుతారని భక్తుల నమ్మకం. బ్రహ్మ రథం కదిలేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, పండితులు నిర్ణయించిన శుభసమయం ఉదయం 7.29 గంటలు కాగా, 8.02 గంటలకు తేరును కదిలించారు.

ఆ సమయంలో తిరువీధులు భక్తుల గోవింద నామ స్మరణతో మార్మోగి పోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తేరు యథాస్థానం చేరుకోవడానికి కేవలం నాలుగు గంటలు మాత్రమే పట్టింది. మధ్యాహ్నం 12 గంటలకే  యథాస్థానం చేరుకుంది. ఈసారి తేరు మోకులు కొత్తవి కావడం, అందులోనూ అవి పొడవు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది భక్తులకు రథంలాగే భాగ్యం కల్గింది. అయితే.. తేరు వేగాన్ని అదుపు చేయడానికి తెడ్లు వేసేవారు ఈసారి బాగానే శ్రమించారు. అయినప్పటికీ పలుచోట్ల అదుపుతప్పి తిరువీధుల్లోని ఇళ్లతో పాటు విద్యుత్‌ స్తంభాలను తాకింది.

          ఉదయాన్నే ఆలయ అర్చకులు తేరు దగ్గర బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి,  ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, జెడ్పీ చైర్మన్‌ చమన్, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌, ఆర్డీఓ వెంకటేశు,  వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు స్వామివారి బ్రహ్మ రథాన్ని కొంత దూరం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. తిరు వీధుల అక్రమణల కారణంగా  రథం లాగేందుకు భక్తులు బాగా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకొని రథంపైకి దవణం, మిరియాలు చల్లేందుకు తిరువీధుల్లోని మిద్దెలపై వేచిఉన్నారు. ఇలా చేస్తే పాప విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఎప్పటిలాగానే రథంపై నిల్చొని రథ కదలికలను మైకు ద్వారా తెలియజేశారు. అలాగే భక్తులతో గోవిందనామ స్మరణ చేయించారు.

           ముందురోజు అంటే శుక్రవారం రాత్రి స్వామి వారు  ఐరావతంపై తిరు వీధుల గుండా భక్తులకు దర్శనమిచ్చి తిరిగి ఆలయం చేరుకున్నారు. శనివారం తెల్లవారు జామున శుభ ముహూర్తాన రథారోహణం గావించారు. ఆనవాయితీగా వస్తున్న మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి వెనుకవైపు నుంచి మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తుంటే వేలాది మంది భక్తులు బ్రహ్మ రథాన్ని లాగారు. రథం ముందు వెళ్తుంటే  వెనుక భాగాన ఫైర్‌ ఇంజన్‌తో పాటు ప్రథమ చికిత్సకు సంబంధించిన అంబులెన్స్‌ వాహనాలు వెళ్లాయి. 

గాయపడిన భక్తులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేస్తూ ముందుకు సాగిపోయారు. మూడు లక్షల మందికి  పైగా భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారని అంచనా. రథం లాగే భక్తులకు దాతలు  మంచినీటి ప్యాకెట్లను అందించారు.  పట్టణంలో అడుగడుగునా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మ రథోత్సవానికి ఉభయదారులుగా కరె నాగరాజు, సుందర రాజు, పాండు రంగయ్య, అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్‌ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్‌ నరేంద్రబాబు తెలిపారు. రథోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డీఎస్పీ ఎన్‌.వెంకటరామాంజనేయులు నేతృత్వంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.  500 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement