rathothsavam
-
పులకించిన భక్తజనం
కొత్తచెరువు : వేలాది మంది భక్తుల నడుమ సంగమేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కొత్తచెరువులోని బుక్కపట్నం రహదారిలో నిర్వహించిన ఈ ఉత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తొలుత ఆలయ ధర్మకర్త మనోహర్ ఇంటి నుంచి స్వామి వారికి అలంకరణ వస్తువులు, జెండాను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శివపార్వతులకు పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంలోకి తీసుకెళ్లారు. అనంతరం భక్తులు శివ నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. -
నేత్రపర్వం.. రథోత్సవం
మడకశిర : మడకశిరలోని కోట లక్ష్మీ వెంకటరమణస్వామి రథోత్సవం బుధవారం నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత రథంలో ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి పూజలు చేశారు. ఆ తర్వాత దేవాలయం నుంచి తేరువీధి వరకు రథాన్ని లాగారు. తేరు లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి, మునిసిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు, చైర్పర్సన్ శరణ్య, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున తహసీల్దార్ హరిలాల్‌నాయక్, డీటీ శ్యామలాదేవి తదితరులు పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే వైవీ తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా శ్రీ వారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. శ్రీ అయ్యప్పస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్ఐసీ ఏజెంట్ శ్రీనివాసరావు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. -
వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్‌లో అశేష జనవాహిన మధ్య వెంకటేశ్వరస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, రథాంగ హోమం, రథ బలి, మాలవీధుల మడుగు రథోత్సవం చేపట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. సాయంత్రం శ్రీవారిని పల్లకీలో ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, అనంతరం రథోత్సవంపై ఆసీనులు చేశారు. అనంతరం రథోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు , గ్రామ కమిటీ సభ్యులు, యువకులు, ప్రజలు, భక్తులు లాగారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై స్వామివారి రథోత్సవం ఊరేగింపుగా సాగింది. గ్రామంలో వేలాది మంది భక్తులు గోవింద నామసర్మణంతో మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బొమ్మనహాళ్ ఎస్ఐ శ్రీరాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
ఘనంగా సంగమేశ్వరుడి వసంతోత్సవం
కూడేరు : స్థానిక శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వడి బ్రహ్మోత్సవాలు గురువారం వసంతోత్సవంతో ముగిశాయి. జోడు లింగాలకు పురోహితుడు శివశంకర్ శాస్త్రి, అర్చకుడు మహేష్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపు చేశారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను కోనేటి వద్ద పవిత్ర జలంతో వేదపండితులు అభిషేకం చేశారు .జోడు లింగాలను దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు పోనుగంటి వారు అన్నదానం చేశారు. ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అక్కి రెడ్డి , ఆలయ సేవా కమిటీ, జీర్ణోద్ధరణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. -
కనుల పండువగా చిక్కణ్ణేశ్వర రథోత్సవం
కణేకల్లు (రాయదుర్గం) : అశేష భక్త జనసందోహం మధ్య చిక్కణ్ణేశ్వరస్వామి రథోత్సవం కణేకల్లులో బుధవారం కనుల పండువగా జరిగింది. ఉదయం 9 గంటలకు సంప్రదాయబద్ధంగా రథానికి పూజలు జరిపి మడుగుతేరు లాగారు. సర్పంచ్ యు.కౌసల్య, ఉప సర్పంచ్ యు.ఆనంద్, పంచాయతీ కార్యదర్శి విజయమ్మ, పంచాయతీ పాలకవర్గం సభ్యులు మేజర్ గ్రామ పంచాయతీ తరఫున రథానికి గజమాల వేశారు. కణేకల్లు మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు చెన్నకేశవులు, గౌరవాధ్యక్షుడు పి.మాబుపీరా, జిల్లా డైరెక్టర్ పెద్ద దేవర నబీసాబ్ సంఘం సభ్యులు గజమాలను రథానికి అలంకరించారు. సాయంత్రం 5 గంటల సమయంలో రథానికి పూజలు నిర్వహించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామాన్ని స్మరించుకుంటూ రథాన్ని ముందుకు లాగారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆలయ ధర్మకర్త జె.ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, వైఎస్సార్సీపీ సేవాదళ్ కన్వీనర్ కె.విక్రంసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా యణ్ణేరంగస్వామి రథోత్సవం
యర్రగుంట (కణేకల్లు) : కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఆరాధ్యదైవమైన యణ్ణేరంగస్వామి వారి రథోత్సవం మండలంలోని యర్రగుంటలో గురువారం అంగరంగవైభవంగా జరిగింది. మండలంలోని యర్రగుంటలో స్వామి ఉత్సవాలు శ్రీరామ నవమి రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నేటి రథోత్సవంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం 5గంటల సమయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని సంప్రదాయబద్ధంగా పల్లకిలో ఉంచి మేళతాళాలు, తపెట్ల నడుమ స్వామి రథోత్సవం జరిగింది. సాయంకాలం 6గంటలకు రథోత్సవం ముగిసింది. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు రాయదుర్గం, బొమ్మనహళ్, బెలుగుప్ప, డి.హీరేహళ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాటిల్ నాగిరెడ్డి, యర్రగుంట సర్పంచు కేశవరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాటిల్ రామచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, కెనిగుంట రామిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు రథాన్ని లాగారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా చూడాలని దేవున్ని వేడుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ యువరాజు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం
హిందూపురం రూరల్ : మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వరి అమ్మవారి రథోత్సవం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రతి ఏటా ఉగాది పండుగ తర్వాత రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గొర్రెలు, మేకలను బలి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం అమ్మవారి మూలవిరాట్ విగ్రహాన్ని ఊరేగింపుగా మేళతాళాలతో తీసుకువచ్చి రథోత్సవంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారి నామస్మరణల నడుమ భక్తులు రథాన్ని ముందుకు లాగారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు బెంగళూరు, గౌరిబిదనూరు తమిళనాడు నుంచి అమ్మవారు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై అమ్మవారికి చీర, సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నమో నారసింహా..
- అంగరంగ వైభవంగా ఖాద్రీ నృసింహుని బ్రహ్మ రథోత్సవం - భక్తజన సంద్రమైన కదిరి పట్టణం - శ్రీవారిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు - కేవలం 4 గంటల్లో యథాస్థానం చేరిన బ్రహ్మరథం కదిరి : శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలతో పాటు కర్ణాటక నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కదిరి పట్టణమంతా భక్తులతో నిండిపోయింది. వారి గోవింద నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీ నారసింహుడు తిరు వీధుల గుండా విహరించేందుకు దేవతలు ప్రతిరోజు ఒక్కో వాహనాన్ని పంపుతారు. బ్రహ్మ రథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మ దేవుడే రథాన్ని నడుపుతారని భక్తుల నమ్మకం. బ్రహ్మ రథం కదిలేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, పండితులు నిర్ణయించిన శుభసమయం ఉదయం 7.29 గంటలు కాగా, 8.02 గంటలకు తేరును కదిలించారు. ఆ సమయంలో తిరువీధులు భక్తుల గోవింద నామ స్మరణతో మార్మోగి పోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తేరు యథాస్థానం చేరుకోవడానికి కేవలం నాలుగు గంటలు మాత్రమే పట్టింది. మధ్యాహ్నం 12 గంటలకే యథాస్థానం చేరుకుంది. ఈసారి తేరు మోకులు కొత్తవి కావడం, అందులోనూ అవి పొడవు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది భక్తులకు రథంలాగే భాగ్యం కల్గింది. అయితే.. తేరు వేగాన్ని అదుపు చేయడానికి తెడ్లు వేసేవారు ఈసారి బాగానే శ్రమించారు. అయినప్పటికీ పలుచోట్ల అదుపుతప్పి తిరువీధుల్లోని ఇళ్లతో పాటు విద్యుత్ స్తంభాలను తాకింది. ఉదయాన్నే ఆలయ అర్చకులు తేరు దగ్గర బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, జెడ్పీ చైర్మన్ చమన్, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, ఆర్డీఓ వెంకటేశు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు స్వామివారి బ్రహ్మ రథాన్ని కొంత దూరం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. తిరు వీధుల అక్రమణల కారణంగా రథం లాగేందుకు భక్తులు బాగా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకొని రథంపైకి దవణం, మిరియాలు చల్లేందుకు తిరువీధుల్లోని మిద్దెలపై వేచిఉన్నారు. ఇలా చేస్తే పాప విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఎప్పటిలాగానే రథంపై నిల్చొని రథ కదలికలను మైకు ద్వారా తెలియజేశారు. అలాగే భక్తులతో గోవిందనామ స్మరణ చేయించారు. ముందురోజు అంటే శుక్రవారం రాత్రి స్వామి వారు ఐరావతంపై తిరు వీధుల గుండా భక్తులకు దర్శనమిచ్చి తిరిగి ఆలయం చేరుకున్నారు. శనివారం తెల్లవారు జామున శుభ ముహూర్తాన రథారోహణం గావించారు. ఆనవాయితీగా వస్తున్న మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి వెనుకవైపు నుంచి మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తుంటే వేలాది మంది భక్తులు బ్రహ్మ రథాన్ని లాగారు. రథం ముందు వెళ్తుంటే వెనుక భాగాన ఫైర్ ఇంజన్‌తో పాటు ప్రథమ చికిత్సకు సంబంధించిన అంబులెన్స్ వాహనాలు వెళ్లాయి. గాయపడిన భక్తులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేస్తూ ముందుకు సాగిపోయారు. మూడు లక్షల మందికి పైగా భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారని అంచనా. రథం లాగే భక్తులకు దాతలు మంచినీటి ప్యాకెట్లను అందించారు. పట్టణంలో అడుగడుగునా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మ రథోత్సవానికి ఉభయదారులుగా కరె నాగరాజు, సుందర రాజు, పాండు రంగయ్య, అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. రథోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డీఎస్పీ ఎన్.వెంకటరామాంజనేయులు నేతృత్వంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. 500 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. -
కరుణించు లక్ష్మీనారసింహా..
చిలమత్తూరు : కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన బ్రహ్మ రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. భక్తుల గోవింద నామస్మరణతో చిలమత్తూరు పులకించిపోయింది. మధ్యాహ్నం 1.45 గంటలకు రథోత్సవాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. -
కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం
శెట్టూరు : మండలంలోని బచ్చేహళ్లి గ్రామంలో గురువారం వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం కనులపండువగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతిపూజ, అభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు హోమం, ఒంటి గంటకు మడుగుతేరు నిర్వహించారు. సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు గ్రామదేవతల పూజ, గంగపూజ చేపట్టారు. అనంతరం 108 పూర్ణకుంభాలతో రథోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారికి పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి గ్రామ పెద్దల సహకారంతో సాంఘిక నాటిక ప్రదర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
వైభవంగా హెంజేరు సిద్ధేశ్వర చిన్నరథోత్సవం
అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన హెంజేరు సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని చిన్న రథోత్సవంలో కూర్చోబెట్టి హంపణ్ణస్వామి గుడి వరకు స్వామివారి నామస్మరణలతో భక్తులు ముందుకు లాగారు. ఈ సందర్భంగా రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాలపల్లకీలో స్వామివారిని గ్రామంలోని పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగించారు. సర్పంచ్ సదాశివ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మడకశిర సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంటకస్వామి తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు బ్రహ్మరథోత్సవం సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నట్లు ఈఓ శ్రీనివాసులు, సర్పంచ్ సదాశివ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. -
నేత్రపర్వం..రథోత్సవం
మార్మోగిన శివనామస్మరణ లేపాక్షి : లేపాక్షి మహాశివరాత్రి ఉత్సవాల్లో శనివారం రథోత్సవం అశేష భక్తజనసందోహం మధ్య నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆగమీకులు సునీల్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు సూర్యప్రకాష్, నరసింహశర్మ అభిషేకార్చన, రథసంప్రోక్షణ, దవనోత్సవం నిర్వహించారు. అనంతరం శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను వేదబ్రాహ్మణులచే పల్లకీలో మోసుకుని వచ్చి రథంలో కొలువుదీర్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బస్టాండ్ వద్ద రథాన్ని లాగారు. 1.30 గంటలకు ఎగువపేటలోని నందివిగ్రహం వద్దకు చేరుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ హనోక్, గ్రామ సర్పంచ్ జయప్ప, వైఎస్సార్సీపీ నాయకులు నారాయణస్వామి, ఆదినారాయణ, టైలర్ మూర్తి, నారాయణ, టీడీపీ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు చలపతి, చిన్న ఓబన్న పాల్గొన్నారు. -
నేడు సుబ్రహ్మణ్యుడి రథోత్సవం
గార్లదిన్నె : మండల పరిధిలోని కోటంక సుబ్రమణ్యస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. రథోత్సవం తిలకించడానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచే కాక జిల్లా నలుములాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. శుద్ధపౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే పలు పూజలు రాత్రి 8గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది. అలాగే ఆదివారం ఉదయం సుబ్రమణ్య స్వామి ఆలయంలో శ్రీవల్లీ, దేవసేన, శ్రీవారి కల్యాణం ఉంటుంది. రథోత్సవం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈడీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. అలాగే అనంతపురం నుంచి ప్రత్యేక బస్సులు కోటంక ఆలయం వరకూ నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
మార్మోగిన గోవింద నామస్మరణం
– వైభవంగా పేటవెంకటరమణ బ్రహ్మరథోత్సవం – భక్తులతో కిటకిటలాడిన చిన్నమార్కెట్ ప్రాంతం హిందూపురం అర్బన్ : వెంకటరమణ.. గోవింద.. గోవిందా.. అంటూ భక్తులు గోవింద నామస్మరణతో పట్టణంలోని పేటవెంటకరమణస్వామి ఆలయం కిటకిటలాడింది. ఆలయంలో శుక్రవారం బ్రçహ్మరథోత్సవం కనులపండువగా అశేష జనవాహినీ మధ్య వైభవంగా సాగింది. ఉదయం మూలవిరాట్ వెంకటరమణస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించి బంగారు కవచధారణతో విశేషపుష్పాలతో అలంకరణలు చేసి పూజలు చేశారు. మధ్యాహ్నం మేళతాళాలు, భజంత్రీలతో కొల్లహపూరి ఆలయం నుంచి పట్టణ ప్రముఖులు, భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో తీసుకువచ్చి పూజలు జరిపారు. అలాగే రథోత్సవ చక్రాల దుంగలను యువకులు మోసుకుని గోవింద నామస్మరణ చేస్తూ ఆలయం చుట్టు ప్రాకారోత్సవం చేశారు. అనంతరం రథంపైకి ఉత్సవమూర్తులు చేరగానే వేలాదిభక్తులు కరతాళ ధ్వనులతో స్వాగతించారు. అలాగే పట్టణ ప్రముఖులు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ జేపీకే రాము, ఈఓ శ్రీనివాసులుతో పాటు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి అశేష భక్తజనులు రథం లాగడంతో రథోత్సవం ముందుకు కదలింది. సాయంత్రం తిరిగి రథాన్ని ఆలయం వద్ద నుంచి ఐదులాంతర్ సర్కిల్ వరకు తీసుకువచ్చి అక్కడి నుంచి సింగర్చౌక్ వద్దకు తీసుకువెళ్లి నిలిపారు. రథోత్సవం సందర్భంగా స్థానిక మెయిన్ బజారులో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వ్యాపారులు, ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం చేశారు. -
శ్వేతగజవాహనంపై కొండమీదరాయుడు
బుక్కరాయసముద్రం : మండలంలోని కొండమీదరాయుడు స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కొండమీదరాయుడు శ్వేత గజ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పుర వీధుల్లో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. అలాగే శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు శ్రీవారు భూదేవి, శ్రీదేవికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పుర వీధుల్లో శ్రీవారిని, భూదేవి, శ్రీదేవిని సూర్య ప్రభ వాహనంపై మండల కేంద్రంలో ఊరేగించనున్నారు. 11 గంటలకు రథోత్సవం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.