కనుల పండువగా చిక్కణ్ణేశ్వర రథోత్సవం
కణేకల్లు (రాయదుర్గం) : అశేష భక్త జనసందోహం మధ్య చిక్కణ్ణేశ్వరస్వామి రథోత్సవం కణేకల్లులో బుధవారం కనుల పండువగా జరిగింది. ఉదయం 9 గంటలకు సంప్రదాయబద్ధంగా రథానికి పూజలు జరిపి మడుగుతేరు లాగారు. సర్పంచ్ యు.కౌసల్య, ఉప సర్పంచ్ యు.ఆనంద్, పంచాయతీ కార్యదర్శి విజయమ్మ, పంచాయతీ పాలకవర్గం సభ్యులు మేజర్ గ్రామ పంచాయతీ తరఫున రథానికి గజమాల వేశారు. కణేకల్లు మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు చెన్నకేశవులు, గౌరవాధ్యక్షుడు పి.మాబుపీరా, జిల్లా డైరెక్టర్ పెద్ద దేవర నబీసాబ్ సంఘం సభ్యులు గజమాలను రథానికి అలంకరించారు.
సాయంత్రం 5 గంటల సమయంలో రథానికి పూజలు నిర్వహించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామాన్ని స్మరించుకుంటూ రథాన్ని ముందుకు లాగారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆలయ ధర్మకర్త జె.ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, వైఎస్సార్‌సీపీ సేవాదళ్ కన్వీనర్ కె.విక్రంసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.