వైభవంగా యణ్ణేరంగస్వామి రథోత్సవం
యర్రగుంట (కణేకల్లు) : కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఆరాధ్యదైవమైన యణ్ణేరంగస్వామి వారి రథోత్సవం మండలంలోని యర్రగుంటలో గురువారం అంగరంగవైభవంగా జరిగింది. మండలంలోని యర్రగుంటలో స్వామి ఉత్సవాలు శ్రీరామ నవమి రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నేటి రథోత్సవంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం 5గంటల సమయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని సంప్రదాయబద్ధంగా పల్లకిలో ఉంచి మేళతాళాలు, తపెట్ల నడుమ స్వామి రథోత్సవం జరిగింది.
సాయంకాలం 6గంటలకు రథోత్సవం ముగిసింది. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు రాయదుర్గం, బొమ్మనహళ్, బెలుగుప్ప, డి.హీరేహళ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాటిల్ నాగిరెడ్డి, యర్రగుంట సర్పంచు కేశవరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాటిల్ రామచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, కెనిగుంట రామిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు రథాన్ని లాగారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా చూడాలని దేవున్ని వేడుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ యువరాజు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.