
వెంకటరెడ్డి చేతికి గాయమైన దృశ్యం
సాక్షి, యర్రగుంట(కణేకల్లు): కణేకల్లు మండలంలోని సమస్యాత్మక గ్రామమైన యర్రగుంటలో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత నడుమ కొనసాగాయి. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలిం గ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అక్కడికి చేరు కొన్న టీడీపీ నాయకులు ప్రచారం చేస్తూ టీడీపీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా వారికి పోటీగా ప్రచారం చేశారు. వైఎస్సార్‌సీ పీ నాయకులు పోలింగ్ కేంద్రం ఆవరణంలో ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు వన్నారెడ్డి, బలరాజు తదితరులు అక్కడున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు ప్రచారం చేసేటప్పుడు మేం ఇక్కడ ప్రచారం చేయడంలో తప్పేంటని వైఎస్సార్‌సీపీ నాయకులు పాటిల్ వెంకటరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డిలు పోలీసులను ప్రశ్నించారు. ఉద యం నుండి వైఎస్సార్‌సీపీ నాయకుల తీరు ఎక్కువైందని టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై మండిపడ్డారు.
ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చేటు చేసుకోంది. వైఎస్సార్‌సీపీ నాయకులు దూకుడు ఎక్కువైందని వారిని ఇక్కడి నుండి పంపుతారా? లేదా? అంటూ టీడీపీ నాయకులు పోలీసులను నిలదీశారు. ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకొంటుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గ్రామ పోలీస్ అధికారి కమల్‌బాషా వెంటనే అక్కడున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పాటిల్ వెంకటరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డిలను బయటికి తీసుకెళ్లారు. అప్పటికీ వారిని టీడీపీ నాయకులు వెంబడించారు. పోలింగ్ కేంద్రం దాటి ఊళ్లో వెళ్తున్న సమయంలో మళ్లీ ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో పాటిల్ వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు వెనుక నుండి పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత మళ్లీ అతనిపై దాడి చేసి చొక్కా చించి చేతికి గాయపరిచారు. ఏఎస్‌ఐ యల్లయ్య, పోలీసులు అక్కడ గుమిగూడిన ప్రజలపై లాఠీచార్జీ చేసి చెల్లాచెదరు చేశారు. అనంతరం రాయదుర్గం రూరల్ సీఐ కె.సాయినాథ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ప్రజలు గుంపులు, గుంపులుగా లేకుండా తరిమికొట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పాటిల్ వెంకటరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు వన్నారెడ్డి, బలరాజు, బండిఎర్రిస్వామి, బండిప్రకాష్, భాస్కర్‌రెడ్డిలను సీఐ అదుపులో తీసుకొన్నారు. జరిగిన ఘటనపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడు పి.వెంకటరెడ్డిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్న కానిస్టేబుల్

పోలింగ్ కేంద్రం బయట గుమిగూడిన ఇరువర్గాల వారు

ప్రజలను తరిమికొడుతున్న ఖాకీలు
Comments
Please login to add a commentAdd a comment