కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఖాద్రీ లక్ష్మీనారసింహుడు భక్తులకు అశ్వవాహనంపై తిరువీధుల్లో దర్శనమిస్తారు. యాగశాలలో నిత్యహోమం గావించి శ్రీవారిని విశేషంగా అలంకరించి సాయం సంధ్యవేళలో ఆలయం పక్కనే ఉన్న అలుకోత్సవ మండపం వద్దకు చేరుకుంటారు. అక్కడ అలుకోత్సవం విశిష్టతను పండితులు భక్తులకు వివరిస్తారు. పక్షం రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఉత్సవానికి ఉభయదారులుంటారు. కానీ స్వామివారి అలుకోత్సవానికి మాత్రం ఎవరైతే ఆలయ సహాయ కమిషనర్‌గా ఉంటారో వారే ఉభయదారులుగా వ్యవహరిస్తారు. ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి దంపతులే ఈసారి శ్రీవారికి సంప్రదాయ బద్ధంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.