వైభవోపేతంగా వసంతోత్సవం
– అశ్వవాహనంపై ప్రహ్లాదవరదుడు
అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిలేశుడి వసంతోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు సోమవారం అశ్వవాహన ఉత్సవంతో ముగిశాయి. సోమవారం తెల్లవారు జామున దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరద స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి దివ్య దర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాదవరదస్వాములను వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ వసంత మండపం వద్దకు ఊరేగింపుగా చేర్చారు.
అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచి వేద పండితులు స్వామి, అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో తిరుమంజనం నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో విహరింపజేశారు. రాత్రి ప్రహ్లాదవరద స్వామి అశ్వవాహనంపై భక్తులను ఆశీర్వదించారు. వసంతోత్సవంలో స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.