భరోసాపై భీతి
భరోసాపై భీతి
Published Sun, Jul 23 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM
80 ఏళ్ల నిశ్చింతపై వక్ఫ్ వివాదం
పెళ్లి సంబంధాలపై తీవ్ర ప్రభావం
కుదుర్చుకున్న ఒప్పందాలకు విఘాతం
ఆందోళనలో బాధితులు
జేసీకి విన్నపాలు
అమలాపురం టౌన్ : అమలాపురం పట్టణంలోని వడ్డిగూడెం, దొమ్మేటివారి వీధుల్లోని పెద్ద పెద్ద నివాస భవంతులే కాదు.. ఆస్పత్రులు.. అపార్ట్‌మెంట్లతో కూడిన విలువైన ప్రాంతం. సుమారు 27.95 ఎకరాలు ఉండి, వాటిలో దాదాపు 80 ఏళ్లకు పైగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, విద్యా సంస్థల భవనాలు నిర్మించుకుని స్థిరపడ్డారు. అవన్నీ నేడు వక్ఫ్ భూముల పరిధిలో ఉన్నాయన్న విషయం వారికి పిడుగుపాటుగా మారింది. 455 సర్వే నెంబరులోని 27.95 ఎకరాలు వక్ఫ్ భూములని రెవెన్యూ నిర్ధారించటం, ఆ భూముల్లో క్రయ విక్రయాలను స్తంభింపచేసి రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అక్కడి ఇళ్ల స్థలాలు, భవనాల క్రయ విక్రయాలు నిలిచి యాజమానులు నానా అవస్థలు పడుతున్నారు. వడ్డి గూడెం, దొమ్మేటివారి వీధుల్లో గల దాదాపు 350 ఇళ్లు, మూడు ఆస్పత్రులు, మూడు విద్యా సంస్థలు, ఆరు ఆపార్ట్‌మెంట్ల యాజమానులకు చెందిన స్థిరాస్తులపై అభద్రతాభావం అలముకుంది. ఆ భూములు తమవని నేడు వక్ఫ్‌బోర్డు హక్కు కోసం పోరాటం చేస్తుండడంతో అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆ భవనాలు, స్థలాలను తాకట్టు పెట్టి బ్యాంకులు, ప్రవేటు వ్యక్తుల నుంచి రుణాలు తెచ్చుకున్నారు. అలాగే మరికొందరు తమ భవనాలు, స్థలాలను తమ ఆడిపిల్లల పెళ్లిళ్ల కోసం పసుపు కుంకుమ కట్నంగా ఇచ్చి సంబంధాలు కుదుర్చుకున్నారు.
కుదిరిన పెళ్లిళ్లపై ప్రభావం
ఈ ప్రాంతాల్లో కొందరు తల్లిదండ్రులు గత ఆరు నెలల్లో తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు కుదుర్చుకుని అందుకు కట్నంగా తమ భవనాలు లేదా స్థలాలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. పెళ్లి ముహూర్తాలు దగ్గర పడుతున్న కొద్దీ కుదుర్చుకున్న వారు ఆ భూములు వివాదాస్పదమైనవనీ, వక్ఫ్ భూములనీ, అవి వద్దని, వివాద రహితమైన కట్న కానుకలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో కట్నం కోసం ప్రత్యామ్నాయ ఆస్తులు లేక, ఇచ్చుకోలేక కుదిరిన పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలూ చోటు చేసుకున్నాయి.
ఆ భూమలను ఇటీవల పరిశీలించిన జిల్లా జేసీ మల్లికార్జునకు బాధితులు ఇదే సమస్యపై ఏకరువు పెట్టారు.
బ్యాంక్‌లు, వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు :
తాకట్టుగా భవనాలు, స్థలాలు పెట్టుకుని ఇచ్చిన రుణాలపై దాతల ఒత్తిడి ఎక్కువవుతోంది. బ్యాంకులు, వ్యాపారులు రుణగ్రస్తుల వద్దకు వెళ్లి త్వరగా రుణ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమస్యను కూడా జాయింట్ కలెక్టర్‌కు బాధితులు వివరించారు.
అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వక్ఫ్ బాధితులు జాయింట్ కలెక్టర్ మల్లిఖార్జునకు తమ సమస్యలు వివరించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్తంభింప చేసిన రిజస్ట్రేషన్లను పునరుద్ధరించాలని వివరించారు. దీంతో జేసీ సాధ్యసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ లోగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వక్ఫ్ భూములుగా భావిస్తున్న ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి స్థలం విస్తీర్ణం, ఆస్తి విలువలు కట్టి తనకు సమగ్ర నివేదక ఇవ్వాలని ఆదేశించారు.
Advertisement
Advertisement