హృదయంగమం.. పరమశివుని ధామం
కోనసీమకు దిగి వచ్చిన హిమగిరి క్షేత్రం
అమలాపురంలో ఆకట్టుకుంటున్న ‘అమరనాథ్’ నమూనాలు
శివరాత్రికి ఓం శాంతి ఆధ్వర్యంలో భారీ సెట్టింగులు
అమలాపురం టౌన్ : హిమగిరి సీమలోని అమరనాథ్ గుహలు..వాటిలో మంచుతో రూపుదిద్దుకున్న అమరనాథు లింగం.. ఆ గుహల్లోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు.. ఇవి కాక వరసగా 108 శివలింగాలు.. ఇవన్నీ ఒకే చోట కొలువుదీరాయి. సాక్షాత్తు పరమశివుడే ముచ్చటపడేంత మనోహరంగా రూపొందిన ఆ దివ్యధామం భక్తులను పరవశింపజేస్తోంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం (ఓం శాంతి) అమలాపురం కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక మాచిరాజువీధిలోని తటవర్తి వారి స్థలంలో ఏర్పాటుచేసిన అమరనాథ గుహలు, శివలింగాల భారీ సెట్టింగ్‌లు రాత్రి సమయాల్లో విద్యుద్దీపాల కాంతులతో భాసిల్లుతూ భక్తులను అయస్కాంతాలుగా ఆకట్టుకుంటున్నాయి. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ దివ్యధామాల సెట్టింగ్‌లను ఆర్డీవో జి.గణేష్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్‌లు మంగళవారం రాత్రి ప్రారంభించారు. 81వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం పేరుతో అమలాపురం ఓం శాంతి కేంద్రం ఇన్‌ఛార్జి బ్రహ్మకుమారి శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. తెల్లటి మంచు గడ్డలతో ఉన్న అమరనా«థ్ గుహలు.. ఆ గుహల్లోకి వెళ్లే అపురూప మార్గం... అందులో మంచుతో ఉన్న అమరనాథ శివలింగాన్ని రూపాందించారు. అదే గుహల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా తీర్చిదిద్దారు. మరో చోట 108 శివ లింగాలు ఒకే చోట కొలువుదీరిన సెట్టింగ్ ఏర్పాటుచేశారు. ఇంకో చోట భారీ శివలింగాన్ని అమర్చారు. సర్వం శివమయంగా మారిన ఆ తావుకు రాత్రయితే చాలు.. పట్టణంలో దారులన్నీ మాచిరాజువీధికే అన్నట్టు.. విద్యుద్దీప కాంతుల్లో వెలిగే ఆ శివధామ దర్శనం కోసం భక్తులు వెల్లువెత్తుతున్నారు. ఈనెల 25∙వరకూ ఈ ప్రదర్శనలు ఉంటాయి.