గందరగోళం
Published Tue, Aug 2 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
–ప్రభుత్వ ఉద్యోగులవేతనాల విషయంలో సందిగ్ధం
–ఇప్పటికే అన్ని నిధులపై ఫ్రీజింగ్ ఆదేశాలు
–జీతాలు కూడా ఫ్రీజ్ అయ్యాయని ప్రచారం
–మధ్యాహ్నానికి ట్రెజరీ నుంచి బ్యాంకులకు బిల్లులు
–సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ ఫ్రీజింగ్ ఆదేశాలు
–కొందరికి మంగళవారమే జమ... మరికొందరికి బుధవారం వచ్చే అవకాశం
–26 తర్వాత బిల్లులు పంపిన వారి స్యాలరీలకు మరో 3, 4 రోజులు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల వేతనం విషయంలో గందరగోళం ఏర్పడింది. సోమవారం సెలవు ఉన్న కారణంగా మంగళవారం కల్లా వేతనాలు తమ అకౌంట్లలో జమ అవుతాయని ఉద్యోగులు భావించారు. కానీ, జిల్లాలో పనిచేస్తున్న అందరు ఉద్యోగుల బ్యాంకు అకౌంట్లలో మంగళవారం వేతనాలు జమ కాలేదు. దీనిపై జిల్లాలోని ఉద్యోగ వర్గాల్లో పలు రకాల ప్రచారం జరిగింది. ఇప్పటికే పెన్షన్లు, పెన్షనర్ల బెనిఫిట్లు, గ్రామపంచాయతీల నిధులు, కాంట్రాక్టు బిల్లులకు సంబంధించి ట్రెజరీలో ఫ్రీజింగ్ అమలవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలపై కూడా ఫ్రీజింగ్ విధించారని జోరుగా ప్రచారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల వేతనాలపై ట్రెజరీలో ఫ్రీజింగ్ విధించడమేమిటనే చర్చ జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు అటు ట్రెజరీ అధికారులు, ఇటు బ్యాంకర్లను ఆరా తీశారు. అయితే, ఉద్యోగుల వేతనాల కోసం ట్రెజరీ ఫ్రీజింగ్‌ను మంగళవారం ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో ఈనెల 26వ తేదీలోపు బిల్లులు ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు బ్యాంకులకు వెళ్లాయి. అయితే, వీరిలో కొందరికి మాత్రం వేతనాలు మంగళవారం అకౌంట్లలో జమకాగా, మరికొందరికి బుధవారం జమ అవుతాయని బ్యాంకు వర్గాలంటున్నాయి. కానీ, 26 తర్వాత బిల్లులు చేసి పంపిన ఉద్యోగులకు మాత్రం మళ్లీ ప్రభుత్వం ఫ్రీజింగ్ ఆదేశాలకు ఉపశమనం ఇస్తేనే జమ అవుతాయని ట్రెజరీ అధికారులు అంటున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్లీ అన్ని రకాల నిధులపై ఫ్రీజింగ్ ఆదేశాలు వచ్చాయని, ఈ కారణంగా మళ్లీ ఆదేశాలను ఉపసంహరించుకునేంతవరకు వారి వేతనాలు జమకావని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 35వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 15వేల మంది టీచర్లున్నారు. వీరిలో కనీసం 10 శాతం మందికి సంబంధించిన బిల్లులు 26 తర్వాత ట్రెజరీలకు పంపినా 5వేల మంది ఉద్యోగులకు వేతనాలు వచ్చేందుకు 3,4 రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ ప్రభుత్వ ఫ్రీజింగ్‌ను ఎత్తివేస్తేనే వారి జీతాలు వస్తాయని, ఈలోపు తాము బిల్లులు చేసి బ్యాంకులకు పంపుతామని ట్రెజరీ వర్గాలంటున్నాయి.
అన్నీ ఫ్రీజింగే..
ఉద్యోగుల వేతనం విషయం అలా ఉంటే, జిల్లాలో ఒక్క హాస్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలు తప్ప ఏ ఒక్క బిల్లుకు సంబంధించిన నిధులు విడుదలయ్యే పరిస్థితి లేదని, అన్ని రకాల బిల్లులపై జూన్ 15 నుంచే ఫ్రీజింగ్ ఉందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ రాబడి శాఖలకు సంబంధించిన ఆదాయం తగ్గిపోవడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని కార్యక్రమాలకు నిధులు మళ్లించాల్సి రావడంతో ట్రెజరీ నుంచి ఇతర బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ముఖ్యంగా గ్రామపంచాయతీలకు సంబంధించిన సిబ్బంది వేతనాలను కూడా ఇవ్వడం లేదు. దీంతో దాదాపు 50–60 కోట్ల రూపాయలవిలువైన బిల్లులు నిలిచిపోయాయని తెలుస్తోంది. అయితే, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బిల్లులు ఆగిపోవడం సహజమేనని, ఉద్యోగుల వేతనాలపై ఫ్రీజింగ్ విధించడం ఇదే మొదటిసారని, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని జిల్లాలో ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలు తలలు పట్టుకుంటున్నారు.
Advertisement
Advertisement