ఆహా.. ఏమిటీ ఊట
♦ మూడు దశాబ్దాలుగా ఉబికి వస్తున్న నీటి ఊట
♦ కరువులోనూ రెండెకరాల పంటకు నీరు
♦ అబ్బురపరుస్తున్న బావి
మెదక్: రెండేళ్ల కరువు...భానుడి భగభగలకు జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి అడుగంటిపోయాయి. కానీ ఓ గ్రామంలో 30 ఏళ్ల క్రితం తవ్విన కేవలం 3గజాలలోతు బావిలో నీటి ధారలు ఉబికి వస్తున్నాయి. తీవ్ర కరువులోనూ రెండెకరాల పంట పొలానికి నీటి తడులందిస్తోంది ఆ బావి. ఈ నీటి ఊటలను చూసిన జనం విస్మయం చెందుతున్నారు. మండలంలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన బద్దం ప్రతాప్‌రెడ్డికి గ్రామ శివారులో నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. తన పొలంలో 30ఏళ్ల క్రితం కేవలం 3గజాల లోతులో ఓ బావిని తవ్వాడు. అందులో అప్పటి నుంచి ఇప్పటి వరకు పుష్కలంగా నీరు వస్తోంది.
ఆ బావి ఆధారంగా తన 4 ఎకరాల పొలంలో పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. రెండేళ్లుగా కరువు ఏర్పడటంతో ప్రస్తుత రబీ సీజన్‌లో రెండెకరాల్లో మాత్రం పలు రకాల కూరగాయల పంటలతోపాటు పశువుల మేతకోసం పచ్చి గడ్డిని పెంచుతున్నాడు. ఈ బావి ఉండటంతో భయానక కరువులోనూ నీటిగోస లేకుండా పంటలు పండించుకుంటానని రైతు బద్దం ప్రతాప్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కాగా 500 అడుగుల లోతు బోర్లు తవ్వినా నీటి ఊటలు కనిపించక ప్రజలు ఆందోళన చెందుతోంటే, కేవలం 3గజాల లోతులో ఉబికి వస్తున్న జలాన్ని చూసి ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా మెదక్-అక్కన్నపేట మధ్య వేస్తున్న రైల్వేలైన్ ఏర్పాటులో ఈ బావి పూడుకుపోతుందని రైతు ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.