అనంత జట్టు శుభారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంత క్రీడా గ్రామంలో శనివారం జరిగిన రెండు టీ–20 మ్యాచుల్లో అనంత జట్టు జయకేతనం ఎగురవేసింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్ ప్రాంతానికి చెందిన క్రికెట్ హాక్స్ జట్టు, అనంతపురం జట్టు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. మొదటి రోజు స్థానిక అనంత క్రీడా గ్రామంలోని ప్రధాన క్రీడా మైదానంలో రెండు టీ–20 మ్యాచ్‌లను నిర్వహించారు.
మొదటి మ్యాచ్ వివరాలు
టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో జాష్ 43 పరుగులు చేయగా మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. అనంత బౌలర్లలో కార్తీక్, సాయి కార్తీక్‌లు చెరి రెండు వికెట్లు సాధించారు. జగన్‌మోహన్‌రెడ్డి, మహబూబ్‌పీరా, నిఖిల్, మహేంద్రరెడ్డిలు చెరో వికెట్‌ను సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ వినీల్‌కుమార్ 44 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫ్రేజర్ మెక్‌హ్యాల్ 3, పోర్టర్ 1, మోంటెగ్యూ 1 వికెట్‌ను సాధించారు.
రెండో మ్యాచ్ వివరాలు
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. జట్టులో కాలెబ్ మాంటెగ్యూ 29 , జాష్ మెక్‌ఆర్డ్‌లే 27 పరుగులు చేశారు. అనంత జట్టు హరినాథ్ 2, సాయి కార్తీక్‌రావు 2, వినీల్‌కుమార్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జట్టులో వినీల్‌కుమార్ 33 పరుగులతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టఫిన్ 3, పోర్టర్‌కు రెండు వికెట్లు దక్కాయి.
జిల్లా క్రీడాకారులు ఉన్నతస్థాయికి ఎదగాలి – విశాల ఫెర్రర్
జిల్లా క్రీడాకారులు తమకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ తెలిపారు. అనంత, న్యూజిలాండ్ జట్ల క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమెతో పాటు ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, న్యూజిలాండ్ జట్టు మేనేజర్ స్టీఫెన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల ఫెర్రర్ మాట్లాడుతూ ప్రతిభను కనబరిచేందుకు జిల్లా క్రీడాకారులకు ఇదో మంచి అవకాశమన్నారు. స్టీఫెన్ మాట్లాడుతూ అనంతపురం చాలా అందంగా ఉందని తెలిపారు. క్రీడాకారులకు అన్ని వసతులను కల్పించినందుకు ఆర్డీటీకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఇరు జట్ల క్రీడాకారులను వారు పరిచయం చేసుకున్నారు.