రూ.4 కోట్లతో పురాతన ఆలయాల పునర్నిర్మాణం
Published Thu, Aug 4 2016 1:55 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
ఆకివీడు : జిల్లాలోని పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.ఎన్.శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక పురాతన వల్లీ సమేత భీమేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో పది ఆలయాలను రూ.4 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. బలుసుమూడి ఆలయం పునర్నిర్మాణానికి రూ. 1.06 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. మిగిలిన ఆలయాలకు రూ.40 లక్షల నుంచి, రూ. 50 లక్షలు కేటాయించామని, వీటితోపాటు దాతల విరాళాలు ఇచ్చారని, పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తే రూ. 5 లక్షలు ప్రభుత్వం, టీటీడీ సమకూర్చుతాయని వెల్లడించారు. వెనుకబడి, గిరిజన తండాల్లో వీటిని నిర్మించాల్సి ఉంటుందన్నారు. భీమేశ్వరస్వామి ఆలయం పునర్నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరు చేశామని, దాతల విరాళం రూ.కోటితో నిర్మాణం పూర్తి చేయాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి ప్రతిష్ఠ ఉత్సవం నిర్వహించాలనే యోచనలో ఉన్నామని వివరించారు. ఈ ఆలయానికి కావాల్సిన ధ్వజస్తంభం ఏర్పాటుకు అటవీశాఖ అనుమతి లభించిందని, ఏ అడవుల్లో ధ్వజస్తంభానికి అనువైన టేకుచెట్టు ఉందో పరిశీలించడానికి ప్రత్యేక బృందం వెళ్లనుందని వివరించారు. ఏఈఈ వెంట దేవస్థానాల మేనేజర్ పి.ఫణికిషోర్, సర్పంచ్ గొంట్లా గణపతి, ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ సన్నిథి వెంకన్నబాబు, గుర్రం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement