endowments
-
ఆలయ సేవకులను నియమించుకోవచ్చు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పెద్ద ఎత్తున భక్తులు వచ్చే దేవాలయాలకు ఆలయ సేవకులను నియమించుకోవచ్చని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. మొవ్వ శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో నిర్మిస్తున్న కల్యాణ మండపం పనులను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలో కానుకల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు విజయవాడ దుర్గగుడి, మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలో అవసరమైన సమయంలో ఆలయ సేవకులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్తీకమాసంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని చెప్పినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులతో కలిసి నదీ పరీవాహక ప్రాంతాల్లోని శివాలయాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆలయ ఏసీ ఎం.శారదాకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. -
కొవ్వలిలో ఏసీబీ సోదాలు
కొవ్వలి (దెందులూరు) : కొవ్వలి గ్రామంలోని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కంచర్ల విజయసాగరబాబు సోదరి ఇంట్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. విజయసాగరబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో గ్రామంలోని సాగరబాబు సోదరి ఎస్.సుధారణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఏసీబీ డీఎస్పీ సుధాకర్, సీఐ జోసఫ్ విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.4 కోట్లతో పురాతన ఆలయాల పునర్నిర్మాణం
ఆకివీడు : జిల్లాలోని పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.ఎన్.శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక పురాతన వల్లీ సమేత భీమేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో పది ఆలయాలను రూ.4 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. బలుసుమూడి ఆలయం పునర్నిర్మాణానికి రూ. 1.06 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. మిగిలిన ఆలయాలకు రూ.40 లక్షల నుంచి, రూ. 50 లక్షలు కేటాయించామని, వీటితోపాటు దాతల విరాళాలు ఇచ్చారని, పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తే రూ. 5 లక్షలు ప్రభుత్వం, టీటీడీ సమకూర్చుతాయని వెల్లడించారు. వెనుకబడి, గిరిజన తండాల్లో వీటిని నిర్మించాల్సి ఉంటుందన్నారు. భీమేశ్వరస్వామి ఆలయం పునర్నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరు చేశామని, దాతల విరాళం రూ.కోటితో నిర్మాణం పూర్తి చేయాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి ప్రతిష్ఠ ఉత్సవం నిర్వహించాలనే యోచనలో ఉన్నామని వివరించారు. ఈ ఆలయానికి కావాల్సిన ధ్వజస్తంభం ఏర్పాటుకు అటవీశాఖ అనుమతి లభించిందని, ఏ అడవుల్లో ధ్వజస్తంభానికి అనువైన టేకుచెట్టు ఉందో పరిశీలించడానికి ప్రత్యేక బృందం వెళ్లనుందని వివరించారు. ఏఈఈ వెంట దేవస్థానాల మేనేజర్ పి.ఫణికిషోర్, సర్పంచ్ గొంట్లా గణపతి, ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ సన్నిథి వెంకన్నబాబు, గుర్రం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దేవాదాయ శాఖలో ‘నకిలీ’ కలకలం
తప్పుడు ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందుతున్న వ్యవహారం కొమురవెల్లి దేవస్థానంలో ఓ ఉద్యోగిపై ఆధారాలతో సహా ఫిర్యాదు హైకోర్టును ఆశ్రయించిన ఇతర ఉద్యోగులు వేములవాడ, కాళే శ్వరం ఆలయాల్లోనూ అక్రమ పదోన్నతులపై ఫిర్యాదులు హైదరాబాద్: నకిలీ పత్రాలతో పలువురు ఉద్యోగులు పదోన్నతులు పొందుతున్న అంశం దేవాదాయ శాఖలో కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా కొమురవెల్లి దేవస్థానంలో పనిచేసే ఓ అధికారి విషయంలో మొదలైన దుమారం.. ఇప్పుడు మొత్తం దేవాదాయ శాఖలో చలనం కలిగిస్తోంది. వరంగల్ జిల్లా కొమురవెల్లి దేవస్థానంలో నకిలీ విద్యార్హత పత్రాలతో పదోన్నతి పొందారని ఆరోపణలున్న అధికారికి ఏకంగా ఆ దేవాలయ ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు అప్పగించడంపై అక్కడి ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై దేవాదాయ శాఖకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో.. తాజాగా కోర్టును ఆశ్రయించారు. రవాణా శాఖలో రాజస్థాన్‌కు చెందిన ఓ వర్సిటీ సర్టిఫికెట్లను సమర్పించిన కొందరు కానిస్టేబుళ్లు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు పొందడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వారిపై ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు స్పందించకపోవడాన్నీ ప్రభుత్వం తీవ్రంగానే పరిగణించింది. తాజాగా కొమురవెల్లి దేవస్థానం అధికారి విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే స్పందించే అవకాశం ఉండడంతో... అసలు తమ శాఖలో ఇలాంటి ఉద్యోగులు ఎందరున్నారనే కోణంలో ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కొమురవెల్లి దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా ఉన్న అంజయ్య అనే ఉద్యోగి కొంతకాలం క్రితం బిహార్‌లోని మగధ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు జత పరిచి సహాయ కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి పొందారు. అయితే ఆయన సమర్పించిన పత్రాలు నకిలీవంటూ ఆలయ ఉద్యోగులు కొందరు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. కానీ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. దీంతో ఆ ఉద్యోగులు మగధ వర్సిటీ నుంచి ఆర్టీఐ కింద వివరాలు సేకరించారు. అంజయ్య పేరుగల వ్యక్తికి ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఆ వర్సిటీ ఇచ్చిన పత్రాలను కూడా దేవాదాయశాఖకు సమర్పించారు. దీనిపై స్పందించిన కమిషనర్ విచారణ జరపాల్సిందిగా దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. ఆయన విచారణ జరిపి అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. ఇదిలా కొనసాగుతుండగానే అంజయ్యను ఏకంగా ఆలయ ఇన్చార్జి ఈవోగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే తరహాలో కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయంలోనూ ఓ ఉద్యోగి నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొంది నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇదే జిల్లా కాళేశ్వరంలోనూ అక్రమంగా ఓ ఉద్యోగికి 2 పదోన్నతులు ఇచ్చారంటూ మరో ఫిర్యాదు అందింది. వీటిపై అధికారులు స్పందించక పోవడంతో వివాదం కాస్తా కోర్టు పరిధిలోకి వెళ్లింది. -
ఏపీలో 8 దేవాలయ సర్క్యూట్లతో టూరిజం ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దేవాలయాలు అన్నింటినీ కలిపేలా పర్యాటక మంత్రిత్వ శాఖతో కలిసి దేవాదాయ శాఖ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆలయాలను 8 సర్క్యూట్లుగా విభజించి, ఒక్కో సర్క్యూట్‌కు ఒక్కో టూరిస్టు ప్లాను రూపొందించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా పంచారామాలు, బౌద్ధ క్షేత్రాలు.. ఇలా అన్నింటినీ సందర్శించేందుకు వీలుగా పర్యటనలు ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం ప్రణాళికను నాలుగైదు నెలల్లోనే అమలు చేయాలని దేవాదాయ శాఖ భావిస్తోంది.