తప్పుడు ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందుతున్న వ్యవహారం
కొమురవెల్లి దేవస్థానంలో ఓ ఉద్యోగిపై ఆధారాలతో సహా ఫిర్యాదు
హైకోర్టును ఆశ్రయించిన ఇతర ఉద్యోగులు
వేములవాడ, కాళే శ్వరం ఆలయాల్లోనూ అక్రమ పదోన్నతులపై ఫిర్యాదులు
హైదరాబాద్: నకిలీ పత్రాలతో పలువురు ఉద్యోగులు పదోన్నతులు పొందుతున్న అంశం దేవాదాయ శాఖలో కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా కొమురవెల్లి దేవస్థానంలో పనిచేసే ఓ అధికారి విషయంలో మొదలైన దుమారం.. ఇప్పుడు మొత్తం దేవాదాయ శాఖలో చలనం కలిగిస్తోంది. వరంగల్ జిల్లా కొమురవెల్లి దేవస్థానంలో నకిలీ విద్యార్హత పత్రాలతో పదోన్నతి పొందారని ఆరోపణలున్న అధికారికి ఏకంగా ఆ దేవాలయ ఇన్‌చార్జి ఈవోగా బాధ్యతలు అప్పగించడంపై అక్కడి ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.
దీనిపై దేవాదాయ శాఖకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో.. తాజాగా కోర్టును ఆశ్రయించారు. రవాణా శాఖలో రాజస్థాన్‌కు చెందిన ఓ వర్సిటీ సర్టిఫికెట్లను సమర్పించిన కొందరు కానిస్టేబుళ్లు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు పొందడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వారిపై ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు స్పందించకపోవడాన్నీ ప్రభుత్వం తీవ్రంగానే పరిగణించింది. తాజాగా కొమురవెల్లి దేవస్థానం అధికారి విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే స్పందించే అవకాశం ఉండడంతో... అసలు తమ శాఖలో ఇలాంటి ఉద్యోగులు ఎందరున్నారనే కోణంలో ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
కొమురవెల్లి దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా ఉన్న అంజయ్య అనే ఉద్యోగి కొంతకాలం క్రితం బిహార్‌లోని మగధ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు జత పరిచి సహాయ కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి పొందారు. అయితే ఆయన సమర్పించిన పత్రాలు నకిలీవంటూ ఆలయ ఉద్యోగులు కొందరు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. కానీ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. దీంతో ఆ ఉద్యోగులు మగధ వర్సిటీ నుంచి ఆర్టీఐ కింద వివరాలు సేకరించారు. అంజయ్య పేరుగల వ్యక్తికి ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఆ వర్సిటీ ఇచ్చిన పత్రాలను కూడా దేవాదాయశాఖకు సమర్పించారు. దీనిపై స్పందించిన కమిషనర్ విచారణ జరపాల్సిందిగా దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. ఆయన విచారణ జరిపి అనుమానాలు వ్యక్తం చేశారు కూడా.
ఇదిలా కొనసాగుతుండగానే అంజయ్యను ఏకంగా ఆలయ ఇన్‌చార్జి ఈవోగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే తరహాలో కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయంలోనూ ఓ ఉద్యోగి నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొంది నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇదే జిల్లా కాళేశ్వరంలోనూ అక్రమంగా ఓ ఉద్యోగికి 2 పదోన్నతులు ఇచ్చారంటూ మరో ఫిర్యాదు అందింది. వీటిపై అధికారులు స్పందించక పోవడంతో వివాదం కాస్తా కోర్టు పరిధిలోకి వెళ్లింది.
దేవాదాయ శాఖలో ‘నకిలీ’ కలకలం
Published Wed, Apr 29 2015 3:54 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement
Advertisement