ఆలయ సేవకులను నియమించుకోవచ్చు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పెద్ద ఎత్తున భక్తులు వచ్చే దేవాలయాలకు ఆలయ సేవకులను నియమించుకోవచ్చని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. మొవ్వ శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో నిర్మిస్తున్న కల్యాణ మండపం పనులను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలో కానుకల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు విజయవాడ దుర్గగుడి, మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలో అవసరమైన సమయంలో ఆలయ సేవకులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్తీకమాసంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని చెప్పినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులతో కలిసి నదీ పరీవాహక ప్రాంతాల్లోని శివాలయాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆలయ ఏసీ ఎం.శారదాకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.