
అసెంబ్లీ మూడు రోజులే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మూడోవారంలో జరిగే అవకాశముంది. ఇవి మూడు రోజులపాటు మాత్రమే జరగనున్నట్టు సమాచారం. శాసనసభ సమావేశాలు గత మార్చిలో జరిగాయి. ఆరు నెలల్లోగా సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఆ మేరకు సెప్టెంబర్ 29వ తేదీలోగా సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. కాగా జీఎస్టీ బిల్లును ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించడం తెలిసిందే. ఆ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుంది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్ని రాష్ట్రాల సీఎంలకు ఈ మేరకు లేఖలు రాశారు. దీంతో ఆ బిల్లు ఆమోదం నిమిత్తం రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంది. పనిలో పనిగా వర్షాకాల సమావేశాలను కూడా నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
స్పీకర్ కోడెలకు ఉండే వీలును బట్టి తేదీల ఖరారు..: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్ని ఐదు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి మూడు రోజులపాటే ఈ సమావేశాలను నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సెప్టెంబర్ ఒకటి నుంచి పదో తేదీ వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగే కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావే శాల్లో పాల్గొనే అవకాశముంది. ఆ తరువాత లేదా అంతకుముందుగా కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వివిధ దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో స్పీకర్ కోడెల కూడా ఉంటారని సమాచారం. ఆయన పర్యటననుబట్టి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీల్ని ఖరారు చేస్తారు.