అమరావతి టౌన్‌షిప్‌లోనే సచివాలయం
► ఆరు లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణం
► సీఆర్‌డీఏ 300 కోట్ల ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: మంగళగిరికి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ‘సాక్షి’ చెప్పినట్లే ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) రూ.300 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. అంటే ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ.5 వేలవుతుంది. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ప్రస్తుతం రూ.180 కోట్లను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ జీవో 278ను జారీ చేశారు. అయితే ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి ఎంత వెచ్చిస్తున్నారనేది జీవోలో పేర్కొనలేదు.
హైదరాబాద్ నుంచి అమరావతి టౌన్‌షిప్‌కు సచివాలయం తరలింపునకు వీలుగా 2016 జూన్‌కల్లా నిర్మాణాన్ని పూర్తి చేయాలని జీవోలో స్పష్టం చేశారు. అమరావతి టౌన్‌షిప్‌లోని 20 ఎకరాల స్థలంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పుడు మంజూరు చేసిన రూ.180 కోట్లలో రాష్ట్రప్రభుత్వం వడ్డీ లేకుండా రూ.90 కోట్లను సీఆర్‌డీఏకు ఇవ్వాలని నిర్ణయించింది. మిగతా మొత్తాన్ని హడ్కో నుంచి సీఆర్‌డీఏ రుణం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయ నిర్మాణానికి టెండర్లను ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్‌తోపాటు శాశ్వత నిర్మాణానికి ఆహ్వానించాలని, ఇందులో ఏ విధానంలో నిర్మాణ వ్యయం తక్కువ వస్తే ఆ విధానాన్ని ఆమోదించాలని స్పష్టం చేశారు.
చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా రూ.5 వేల చొప్పున ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.300 కోట్లు వ్యయం చేస్తున్నారని ‘సాక్షి’ ప్రచురించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.180 కోట్లనే మంజూరు చేసినప్పటికీ మిగిలిన మొత్తాన్ని తరువాత మంజూరు చేస్తారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కాగా, తాత్కాలిక సచివాలయానికి చదరపు అడుగుకు రూ. 3 వేలు మాత్రమే ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. రూ.180 కోట్లతో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను నిర్మిస్తామని తెలిపారు. ఇందులో రూ. 90 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో నుంచి దీర్ఘకాలిక రుణంగా వస్తుందని తెలిపారు.