ఏపీలో పేదలకు ఆకాశ హర్మ్యాలు | andhra pradesh's slums reach for the sky buildings! | Sakshi
Sakshi News home page

ఏపీలో పేదలకు ఆకాశ హర్మ్యాలు

Published Mon, Dec 28 2015 8:12 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

andhra pradesh's slums reach for the sky buildings!

*ఆధునిక శైలిలో నిర్మాణాలు-అత్యాధునిక సౌకర్యాలు
*ముందుకొచ్చిన సైబర్‌సిటీ బిల్డర్స్

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఆకాశ హర్మ్యాలు రానున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో  ఆధునిక శైలిలో నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం ప్రయివేటు నిర్మాణ సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సామాన్యులు కూడా కొనగలిగే ఇళ్ల  నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. రానున్న కాలంలో ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణం మురికివాడల్ని ప్రోత్సహించేదిగా కాకుండా ఎకనమిక్ యాక్టివిటీ పెంచేందుకు దోహదపడేలా వుంటుందని ఆయన చెప్పారు.

సోమవారం సాయంత్రం సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నవ్యాంధ్ర నిర్మాణాన్ని భుజానికెత్తుకున్న ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుని పేద వర్గాలకు కూడా సౌకర్యవంతమైన గృహ నిర్మాణాలను చేపట్టే ఉద్దేశంతో ముందుకువచ్చినట్టు ఈ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో లక్షకు పైగా ఫ్లాట్లను నిర్మించిన అపారమైన అనుభవం తమకుందని, ఈ అనుభవంతో ఏపీలో పేదవారికి అన్ని సదుపాయాలు వున్న ఇళ్లను అందుబాటు ధరలో నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చామని వీరు తెలిపారు.

 

నాణ్యమైన పద్దతుల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా ఇంటీరియర్ డిజైన్ చేసి ఫర్నిచర్‌తో సహా లైఫ్ స్టయిల్ ఇళ్లను అందివ్వడమే తమ ప్రాజెక్టు ప్రత్యేకత అని వివరించారు. విట్రిఫైడ్ టైల్స్, లిఫ్టు సౌకర్యాలతో బహుళ అంతస్థుల భవనాలను తమ సొంత పెట్టుబడితో ప్రభుత్వ సహకారంతో నిర్మించి ఇస్తామని వీరు తెలిపారు. పేదల ఇళ్లంటే స్లమ్ హౌసెస్‌గా కడతారనే ముద్రను చెరిపేసి ఆధునిక శైలిలో గృహనిర్మాణం చేస్తామని, అక్కడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు.


ఏపీలో ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన గృహ నిర్మాణంలో ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చి భాగస్వామ్యం కావడం ఆహ్వానించతగ్గ పరిణామమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అందుబాటులో వుండేలా ఇళ్లను నిర్మించడానికి ఇంకా మరిన్ని సంస్థలు ముందుకురావాలని ఆయన కోరారు. అధునాతన సాంకేతిక పద్దతులు, నాణ్యమైన నిర్మాణ సామాగ్రి ఉపయోగించి సాధ్యమైనంత వేగంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

వచ్చే నెలలో విశాఖలో జరిగే పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు పూర్తి ప్రతిపాదనలతో వస్తే అక్కడ చర్చించి మరికొన్ని సంస్థలను కూడా  కలుపుకుని కార్యరూపం దాల్చేలా నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి సైబర్‌సిటీ డెవలపర్స్‌కు చెప్పారు. ప్రభుత్వ ఇంటర్నల్ ఆర్కిటెక్ట్ బాధ్యతలను ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు అప్పగిస్తామని సీయం చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ కార్యదర్శి  లవ్ అగర్వాల్, సంస్థ ప్రతినిధులు మురళీకృష్ణ, శ్రీవర్ధన్ రెడ్డి... ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement