అంగలూరు చరిత్రకెక్కింది
-
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి
అంగలూరు (గుడ్లవల్లేరు): వందేళ్లు పైబడిన గ్రంథాలయంతోపాటు కవిరాజు రామస్వామి పుట్టినగడ్డగా అంగలూరు చరిత్రకు ఎక్కిందని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్, బేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్(బ్రీడ్) సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కె. రామచంద్రమూర్తి అన్నారు. శుక్రవారం ఆయనతోపాటు ఆ సంస్థ సెక్రటరీ కాకాని రామ్మోహనరావు, జాయింట్ సెక్రటరీ వీ కేశవరావు, పార్టనర్ ఎన్ భాస్కరరావు బృందం అంగలూరు వచ్చారు. డైట్‌లో ఛాత్రోపాధ్యాయులు నారతో తయారు చేసిన క్యారీబ్యాగ్‌లను డాక్టర్ రామచంద్రమూర్తికి అందజేశారు. డైట్ గేటు రోడ్డు బురదమయంగా మారిందని, దానిని వెంటనే శ్రమదానంతో బాగు చేయాలని ఈడీ కోరారు. మట్టి ట్రాక్టర్ల రాకపోకలతో ఆ రోడ్డు వర్షానికి బురదగా మారిందని సిబ్బంది సమాధానమిచ్చారు. డైట్ కార్యాలయంలో ఛాత్రోపాధ్యాయులు సాధించిన బహుమతుల ను ఆయన పరిశీలించారు. రూ.30 లక్షలతో మరమ్మతులు జరుగుతున్న తరగతి గదులను చూశా రు. డైట్ ప్రాంగణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గతంలో 226 మంది ఉన్న బాలికల సంఖ్య 186కు ఎందుకు పడిపోయిందని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూళ్లతో పోటీగా మౌలిక వసతులు ఉన్న ఈ హైస్కూల్‌లో ఎందుకు విద్యార్థినుల సంఖ్య తగ్గిందన్నారు. అనంతరం గ్రామస్తుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి రూ.5 లక్షలు విరాళమిచ్చిన తరగతుల భవన నిర్మాణాన్ని పరిశీలించారు.