రూ. 9,401 కోట్లతో వార్షిక ప్రణాళిక
► వ్యవసాయానికి రూ.5,085.63 కోట్లు
► వ్యవసాయేతర రంగానికి రూ.853.57 కోట్లు
► ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.2,168.40 కోట్లు
► ప్రణాళికను ఆవిష్కరించిన కలెకర్ట్, బ్యాంకు అధికారులు
కడప అగ్రికల్చర్ : ఈ ఏడాది జిల్లా ఆర్థిక పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు జిల్లా కలెకర్ట్ కేవీ సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం నూతన కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జిల్లాకు 2017-18 సంవత్సరానికిగాను బ్యాంకర్లు రూపొందించిన కొత్త ఆర్థిక ప్రణాళికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2017-18కిగాను వార్షిక ప్రణాళికకు సంబంధించి రూ.9401 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి రూ. 5085.63 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. గత ఏడాది రూ. 4910.87 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని తెలిపారు. పంట రుణాలకు రూ. 3939.58 కోట్ల లక్ష్యానికిగాను రూ.3607 కోట్లు రుణం అందించారన్నారు.
ఇతర వ్యవసాయేతర రంగాలకు రూ.853.57 కోట్లు ఇవ్వనున్నారని తెలిపారు. గత ఏడాది రూ.873 లక్ష్యంకాగా కేవలం రూ.2.31 శాతం ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.2168.40 కోట్లు ఇవ్వడానికి ఈ ప్రణాళికలో పొందుపరచారని తెలిపారు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు తప్పని సరిగా నిర్ధేశించుకున్న లక్ష్యాలను అధిగమిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం లేవాకు రఘునాధ్‌రెడ్డి, నాబార్డు ఏజీఎం శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, పలు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.