పాతబస్టాండు వద్ద పదిరోజులుగా తెరుచుకోని ఏటీఎం
కర్నూలు (అగ్రికల్చర్): ఏటీఎం సేవలు పూర్తిగా స్తంభించాయి. జిల్లాలో 485 ఏటీఎంలు ఉండగా..పట్టుమని 10 కూడా పని చేయడం లేదు. ఆంధ్రాబ్యాంకుతో సహా వివిధ బ్యాంకుల ఏటీఎంలు పది రోజులుగా మూతపడ్డాయి. కొన్నిచోట్ల మాత్రం ఎస్‌బీఐ ఏటీఎంలు పని చేస్తున్నాయి. వీటి దగ్గర నగదు కోసం వందలాది క్యూ కడుతున్నారు. రూ.2వేలు, కొత్తగా వచ్చిన రూ.500 నోట్లు ఏటీఎంలలో పెట్టేందుకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉండటం, నగదు లేకపోవడం వల్ల అవి మూతపడిపోయాయి. ఎస్‌బీఐ ఏటీఎంల్లో సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 10 ఏటీఎంల్లో పెడుతున్న నగదు గంట, రెండు గంటల్లోనే ఖాళీ అవుతుండటంతో వందలాది మందికి నిరాశనే మిగులుతోంది. జిల్లాలో 34 బ్యాంకులకు సంబంధించి 445 బ్రాంచ్‌లు ఉండగా, వీటిల్లో రూ.2000 నోట్లు తప్ప ఇతరత్రా కరెన్సీ లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన రూ.160 కోట్లు అన్ని బ్యాంకులకు పంపిణీ చేశారు. ఈ నగదు వివిధ బ్యాంకుల్లో ఉండటంతో సోమవారం ప్రజలు పోటెత్తారు. ప్రతి బ్యాంకులో కనీసం 400 నుంచి 600 మంది వరకు రావడంతో బ్యాంకులు కిటకిట లాడాయి. నగదు నిల్వలు పడిపోవడంతో బ్యాంకు కౌంటర్లలో కేవలం రూ.4000 నుంచి రూ.6000 వరకు పంపిణీ చేశారు. ఉద్యోగుల్లో ఇప్పటికి 20 శాతం మంది జీతాలకు నోచుకోలేదు.