
తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన
తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికి బుధవారం ఉదయం 8.23 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శంకువును స్థాపించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మందడం-మల్కాపురం గ్రామాల మధ్య వెలగపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో 196 సర్వే నంబరు నుంచి 216 సర్వేనంబర్లలోని భూముల్లో తాత్కాలిక సచివాలయ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 45 ఎకరాల భూమిలో.. 28.4 ఎకరాల్లో భవన నిర్మాణాలు, 17 ఎకరాల్లో పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయనున్నారు. 197 సర్వేనంబరు భూమిలో సీఎం బుధవారం శంకుస్థాపన చేశారు.
తాత్కాలిక సచివాలయాన్ని సకల హంగులతో నిర్మించనున్నారు. 6 భవనాలపైనా పోలార్ ప్యానళ్లను ఏర్పాటుచేసి, సచివాలయానికి అవసరమయ్యే విద్యుత్‌నంతటినీ సమకూర్చాలని సీఆర్‌డీఏ ప్రణాళిక రూపొందించింది. సుమారు 5 వేల మంది ఉద్యోగులు, అధికారులు పనిచేసే సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ భవనాలకు ప్రత్యేకంగా నీటిసరఫరా వ్యవస్థను, మురుగునీటి శుద్ధిప్లాంటును నెలకొల్పుతున్నారు.