నిరంకుశ పాలనపై నిరసన వెల్లువ
శ్రీకాకుళం: మీడియా స్వేచ్ఛను హరిస్తున్న టీడీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనపై నిరసన వెల్లువెత్తింది. ‘సాక్షి’ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ జలుమూరు, లావేరు, ఆమదాలవలస మండలాల్లో ధర్నాలు, ఆందోళనలు, కొవ్వొత్తుల ర్యాలీలు సోమవారం నిర్వహించారు. ప్రభుత్వ తీరును వివిధ రాజకీయ పార్టీలు, అఖిల పక్షాల నాయకులు, ప్రజాసంఘాల సభ్యులు తప్పుబట్టారు. ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. జలుమూరు మండలంలో జరిగిన ఆందోళనలో వైఎస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ తక్షణమే మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అవినీతిని వెలికితీస్తుందనే అక్కసుతో ప్రసారాలు నిలిపివేయడం తగదన్నారు. చంద్రబాబు పాలనంతా జన్మభూమి కమిటీలకే పరిమితమైందన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఎం.శ్యామలరావు, జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబూలు మాట్లాడుతూ మీడియాను నియంత్రించే ఏ ప్రభుత్వాలు ఇప్పటివరకు మనుగడ సాగించలేదన్నారు. అనంతరం ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ తహశీల్దార్ ప్రవళ్లికాప్రియకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కొయ్యాన సూర్యం, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు తంగి మురళీకృష్ణ, మండల విప్ బుక్కా లక్ష్మణరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు కె. దామోదరావు, పైడి విఠలరావు, పొన్నాడ విజయ్, వెలమల అసిరినాయడు, బగ్గు లక్ష్మణరావు, కనుసు రవి, పంచిరెడ్డి రాజారావు, సోమినేని కృష్ణ, లోక్‌సత్తా నాయకులు మామిడి సత్యనారాయణ, పాత్రికేయుడు ఎస్.శాంత భాస్కరరావు పాల్గొన్నారు.
కక్ష సాదింపు చర్యే
లావేరు: సాక్షి టీవీ ప్రసారాలును నిలిపివేయడం కక్ష సాధింపు చర్యేనని వైఎస్సార్ సీపీ సాంసృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రొక్కం బాలకృష్ణ, మండలాధ్యక్షుడు దన్నాన రాజినాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజాపంతుల ప్రకాశరావులు అన్నారు. సాక్షి టీవీ ప్రసారాలు వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ తహశీల్దార్ పి .వేణుగోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్లె అప్పలనాయుడు, లుకలాపు అప్పలనాయుడు, మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి తిరుపతిరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు దంగుడుబియ్యపు మురళీ, మాజీ మండలాధ్యక్షుడు వట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వొత్తుల ర్యాలీ
ఆమదాలవలస: సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆమదాలవలస పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు, పార్టీ నాయకులు సైలాడ దాసునాయుడు, యండా విశ్వనాథం, కూన రామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ ధనుంజయరావు, సాక్షి టీవీ ప్రతినిధి దుంపల నందికేశ్వరరావులు పాల్గొన్నారు.