సబ్ కలెక్టర్ సృజనకు వినతిపత్రం అందజేస్తున్న ఏపీ శాక్స్ ఉద్యోగులు
ఏపీ శాక్స్ ఉద్యోగులు విధుల బహిష్కరణ
Published Mon, Sep 19 2016 8:12 PM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM
విజయవాడ (లబ్బీపేట) : తమ న్యాయమైన డిమాండ్‌ల పరిష్కారం కోరుతూ ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీ శాక్స్) ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ఇందులో భాగంగా సోమవారం విధులు బహిష్కరించారు. దీంతో జిల్లాలోని నాలుగు ఏఆర్‌టీ సెంటర్లతోపాటు 80కి పైగా ఐసీటీసీ, పీపీటీసీటీ సెంటర్లలో సేవలు నిలిచిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా, అరకొరగానే సేవలు అందడంతో రోగులు ఇబ్బందిపడ్డారు. పాత ప్రభుత్వాస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్ నుంచి ఉద్యోగులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. సబ్ కలెక్టర్ సృజనను కలిసి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ టీవీఎస్‌ఎన్ శాస్త్రికి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు అపర్ణ, అరుణ, కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము 15 ఏళ్లుగా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలిలో వివిధ హోదాల్లో పని చేస్తున్నా, కనీన సదుపాయాలు కల్పించకపోవటం బాధాకరమన్నారు. చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని చెప్పారు. ప్రతీ నెలా సక్రమంగా వేతనాలు సైతం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో టీబీ తదితర వ్యాధులు సోకి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను పట్టించుకునే నాథుడే లేరని వాపోయారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణలో కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సేవలు గుర్తించి ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్నామని, నేడు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సిన వచ్చిందని తెలిపారు. యూనియన్ ప్రచార కార్యదర్శి కె.వరప్రసాద్, నాయకులు మందా రవి, మేరుగు అనిల్, భాస్కరరావు, సౌజన్య, డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement