రోజాకు క్షమాపణ చెప్పాలి
జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ఆహ్వానించి.. ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అవమానించడం దారుణమని.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య డిమాండ్ చేశారు.
– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య
– ముఖ్యమంత్రి చంద్రబాబుది దుర్మార్గపు పాలన: ఎమ్మెల్యే ఐజయ్య
కల్లూరు (రూరల్): జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ఆహ్వానించి.. ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అవమానించడం దారుణమని.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య డిమాండ్ చేశారు. స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. మహిళలు కన్నీరుపెడితే ఏ రాష్ట్రం సుభిక్షంగా ఉండదన్నారు. చంద్రబాబు పాలనలో వర్షాలు లేక రైతులు అన్నమో రామచంద్ర అంటూ కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు పోవాలని.. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రావాలని చెప్పారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళలు, దళితుల వ్యతిరేకిగా ముద్రవేసుకున్నారన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, కార్యకర్తలు జీతాలు పెంచాలని ఆందోళనకు దిగితే మహిళలని చూడకుండా పోలీసులతో ఈడ్చిపడేసి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాకనే ఎమ్మెల్యే రోజాను అవమానించారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ నేతలకు గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శౌరీలు విజయకుమారి మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమెల్యే చింతమనేని దాడి చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధాన చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌టీయూసీ నగర అధ్యక్షుడు కటారి సురేష్, నాయకులు సూరి, ఉమాదేవి, పద్మ పాల్గొన్నారు.