సర్వ మంగళాదేవిగా అమ్మవారి దర్శనం
-
భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో ఆదివారం ఉదయం అమ్మవారిని మాత్రా క్రమంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజు శర్మ, పార్నంది నర్సింహమూర్తి, టక్కరసు సత్యం తదితరులు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ధృవమూర్తిని టమాట, నిమ్మకాయలు, ఆకుకూరల దండలతో, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భద్రకాళి మాత ఇచ్ఛామూర్తిని మాత్రాక్రమంలోనూ, సర్వమంగళా మాతగా అలంకరించారు. చతుః స్థానార్చన పూజలు, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. నేడు(సోమవారం) ముద్రా, జ్వాలామాలినీ క్రమాలలో అమ్మవారు పూజలు అందుకోనున్నారు. రేపు(మంగళవారం) శాకంబరీ అలంకరణ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలుగకుండా దేవాలయంలో క్యూలైన్లను ఏర్పాటు చేశారు.