
రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
► ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో రూ.40.15 కోట్లతో 2,500 యూనిట్లు మంజూరు
► 31వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం
కొత్తగూడెంరూరల్: జిల్లాలోని ఎస్సీ యువతీ, యువకులకు 2017–18 ద్వారా బ్యాంకు రుణాలు పొందేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎస్సీ కార్పొరేషన్ కోసం ఆన్‌లైన్ చేసుకుని ఉంటే ఆ దరఖాస్తును రెన్యువల్ చేసుకోవాలి. జిల్లాలో 2,542 యూనిట్లకు గాను రూ.40.15 కోట్ల నిధులు విడుదల చేశారు.
ఇందులో రూ.లక్ష రుణానికి రూ.80 వేలు సబ్సిడీ ఇస్తుండగా, రూ.2 లక్షల రుణానికి రూ.70 వేలు సబ్సిడీ వర్తిస్తుంది. రూ.2 లక్షలు పైబడిన యూనిట్‌కు రూ.60 వేలు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షలకు మించకుండా బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు గలవారు అర్హులుగా ప్రకటించారు. ఈనెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఆధార్‌కార్డు, సాంకేతిక విద్యార్హత జతపర్చి పట్టణానికి చెందిన అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్‌కు, మండలాల అభ్యర్థులు ఎంపీడీఓకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత, వాటికి సంబంధించి జిరాక్స్ పత్రాలు ఇవ్వాలి.
జిల్లాలో జనాభా ప్రాతిపదికన నాలుగు మున్సిపాలిటీలు, ఇతర మండలాలకు యూనిట్ల కేటాయింపు రెండుమూడు రోజుల్లో జరగనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహేశ్వర్ తెలిపారు. గతంలో 2016–17కు సంబంధించిన యూనిట్లను మంజూరు చేయడం జరిగిందని, త్వరలో వాటికి సంబంధించిన సబ్సిడీని ఎకౌంట్‌లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్సీలు ఉపయోగించుకుని స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మహేశ్వర్ పేర్కొన్నారు.