పెద్ద మనుషులు ఎగ్గొట్టిన రూ. 25 వేల కోట్లు మాఫీ చేయడానికి ముందుకు వచ్చిన బ్యాంకర్లు పేదలకు రుణాలివ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు.
ఏలూరు (మెట్రో) : పెద్ద మనుషులు ఎగ్గొట్టిన రూ. 25 వేల కోట్లు మాఫీ చేయడానికి ముందుకు వచ్చిన బ్యాంకర్లు పేదలకు రుణాలివ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఎల్‌ఆర్‌సీ సమీక్ష సమావేశంలో బ్యాంకు అధికారులతో కలెక్టర్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎంతో మంచివారని తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని తిరిగి బ్యాంకులకు చెల్లించే ఆలోచనలతో ఉన్న ప్రజలకు రుణాలివ్వడానికి ఎందుకు బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్పాదక రంగానికి రుణాలివ్వకుండా వడ్డీ వ్యాపారం చేసే బడాబాబులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం వల్ల జిల్లాలో ఆశించిన ప్రగతి ఎలా సాధ్యపడుతుందని, పేదలకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. బ్యాంకర్ల కమిటీ, జిల్లా బ్యాంకు అధికారుల సంప్రదింపుల కమిటీ నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు పేదలకు రుణాలు ఇవ్వడం లేదని కలెక్టర్ ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతేడాది 42 మందికి , బీసీ కార్పొరేషన్ ద్వారా 440 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 280 మందికి లోన్లు ఇవ్వాలని చెప్పినప్పటికీ బ్యాంకర్లు నేటికీ ఖాతాలు ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసే వారికి లోన్లు ఇస్తే ఉత్పాదకత పెరిగి అటు రైతులు ఇటు జిల్లా అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో విప్ చింతమనేని ప్రభాకర్, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం గురుమూర్తి, ఆర్‌బీఐ ఏజీఎం హరిహరశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డు డీడీఎం రామప్రభు పాల్గొన్నారు