కార్తీక పౌర్ణమికి విస్తృత ఏర్పాట్లు
కార్తీక పౌర్ణమికి విస్తృత ఏర్పాట్లు
Published Sat, Nov 12 2016 9:26 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
కృష్ణా నది వద్ద పుణ్య నదీ హారతులు
- గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం
- ఆలయపూజావేళల్లో మార్పులు
- శనివారం రాత్రి నుంచే ప్రారంభమైన రద్దీ
శ్రీశైలం: కార్తీక పౌర్ణమి, శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కలిసి వస్తుండటంతో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు శ్రీశైలాలయం ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఈఈ, డీఈ, ఆలయ ఏఈఓ, పర్యవేక్షకులతో కలిసి ఆలయ ప్రాంగణం, ఉచిత, ప్రత్యేక దర్శన క్యూలను పరిశీలించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ పాతాళగంగ స్నానఘట్టాల వద్ద సాయం సంధ్యవేళ కృష్ణవేణి నదీమతల్లికి ఏకాదశ హారతులిస్తామన్నారు. సోమవారం సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు సంకల్పం, విఘ్నేశ్వరపూజ, కృష్ణవేణి నదీమతల్లికి విశేషపూజలు, పుణ్యనదీహారతులు, కార్తీక దీపోత్సవం అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. నదితీరంలో భక్తులు పుణ్యనదీహారతులను వీక్షించేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేశామని.. సేఫ్టీబోటుతో పాటు గజ ఈతగాళ్లను నియమించామన్నారు. అదేవిధంగా రాత్రి 7గంటల నుంచి గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణోత్సవం నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నదీ హారతులలో భాగంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణ.. మంగళవాయిద్యాల నడుమ సోమవారం సాయంత్రం ఏకాదశ (11 రకాలైన) హారతులను నదీమ తల్లికి శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు.
సౌకర్యాల ప్రత్యక్ష పర్యవేక్షణ
ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు ఈఓ వెల్లడించారు. ఉచిత దర్శనం, ఆర్జితసేవా క్యూలు, ప్రత్యేక దర్శనం క్యూలను వీళ్లంతా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. దర్శనం కోసం క్యూలలో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, మంచినీరు, మజ్జిగ అందిస్తామన్నారు.
శనివారం రాత్రి నుంచే భక్తుల రద్దీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ పూజా వేళల్లో మార్పు చేశారు. ప్రధానంగా సోమవారం వేకువజామున 2.30గంటలకు ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతి నిర్వహిస్తారు. 3.30గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి, ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement