శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
Published Wed, Jan 18 2017 10:24 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– ఫిబ్రవరి 17 నుంచి బ్రహ్మోత్సవాలు
– భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు
– అధికారులకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైల బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కోఆర్డినేషన్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ముందుగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి భరత్‌గుప్తా బ్రహోత్సవాలకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫిబ్రవరి 17 నుంచి 26వ తేదీ వరకు బ్రహోత్సవాలు జరుగుతాయని, 24న మహా శివరాత్రిని పురస్కరించుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతేడాది వరకు కల్యాణోత్సవాన్ని చంద్రావతి మండపంలో నిర్వహించామని, ఈ యేడాది నాగుల కట్ట లో జరిపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని, పారిశుద్ధ్య, తాగునీరు, మరుగుదొడ్లు, చలువ పందిళ్లు, భోజన సదుపాయాలపై దృష్టి సారించాలని వివరించారు. ఈ యేడాది ప్రయోగాత్మకంగా 13 జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎంపిక చేసిన భక్తులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీశైలంతో పాటు ఆత్మకూరు నుంచి దొర్నాల, అక్కడి నుంచి నుంచి శ్రీశైలం వరకు రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను ఈ నెల చివరికల్లా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికులకు సంఖ్యకు సరిపడే బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 21వ తేది ఉదయం నుంచి 27 వరకు స్పర్శ దర్శనాన్ని నిలుదల చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ..శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. సమావేశంలో జేసీ హరికిరణ్,, జేసీ–2 రామస్వామి, డీఆర్వో గంగాధర్ గౌడ్, ఆత్మకూరు డీఎఫ్‌ఓ సెల్వం, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement