పెండింగ్ కేసులను పరిష్కరించాలి
కడప అర్బన్ :
జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని, వీలైనంత వరకు లోక్ అదాలత్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు అన్నారు. జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవనంలో శనివారం మెజిస్ట్రేట్లకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోర్టులలో ఎక్కువకాలం పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేందుకు వీలైనంత త్వరగా కృషి జరగాలన్నారు.
న్యాయపరమైన సందేహాలుంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. లేదా సీనియర్ జడ్జిలను, రిటైర్డ్ జడ్జిలను సంప్రదించాలన్నారు. ఈ వర్క్‌షాప్ ద్వారా మరింత న్యాయ పరిజ్ఞానాన్ని పొందేందుకు కృషి చేయాలన్నారు. మెజిస్ట్రేట్లు తాము ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటికి పరిష్కార మార్గాలను సూచించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీతాపతి, జిల్లా కోర్టు రిటైర్డ్ జడ్జి మాధవరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లాలోని వివిధ కోర్టులలో పనిచేస్తున్న మెజిస్ట్రేట్లు పాల్గొన్నారు.