అసైన్డు భూములనూ కొల్లగొట్టారు... | Asainda lands | Sakshi
Sakshi News home page

అసైన్డు భూములనూ కొల్లగొట్టారు...

Published Fri, Mar 4 2016 2:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

అసైన్డు భూములనూ కొల్లగొట్టారు... - Sakshi

అసైన్డు భూములనూ కొల్లగొట్టారు...

రాజధాని ప్రాంతంలో రైతుల భూములే పెట్టుబడిగా రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు పక్కాగా రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అస్మదీయులతో కలిసి వ్యూహాత్మకంగా అసైన్డు భూములను కొల్లగొట్టారు. పట్టా భూముల తరహాలనే అసైన్డు భూములకూ పరిహారం ఇచ్చేలా రాజధాని భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసినా... పరిహారం ఇవ్వరంటూ టీడీపీ నేతలు ఊరూరా ప్రచారం చేయించారు. ఈలోగా అసైన్డు భూముల రైతులకు పంపిన కౌలు చెక్‌లను వెనక్కి పంపాలంటూ ప్రభుత్వం జూన్ 12న సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్‌ను ఆదేశించింది.  దాంతో.. అసైన్డు భూముల రైతులకు పంపిణీ చేయాల్సిన కౌలు చెక్‌లను సీఆర్‌డీఏ అధికారులు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. దీన్ని సాకుగా చూపి... అసైన్డు భూములను ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ మరోసారి లంక గ్రామాల్లో భారీ ఎత్తున ప్రచారం చేశారు. రైతులను మరింత భయపెట్టి ఎకరం రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ కొనుగోలు చేశారు. ఆ తర్వాత అసైన్డ్ భూముల సేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో భూముల ధరలు పెరిగి భారీగా లాభపడ్డారు.
 
అస్మదీయుల మధ్యే పోటాపోటీ!
అసైన్డు భూముల కొనుగోలులో సీఎం అస్మదీయుల మధ్య పోటీ నెలకొంది. సీఎం తనయుడు లోకేష్, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావులు మంగళగిరిలో నివాసం ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ద్వారా బినామీ పేర్లతో అసైన్డు భూములు కొనుగోలు చేయించారని దళిత పేద రైతులు ‘సాక్షి’కి చెప్పారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, అమరావతి మండలాల్లో వీరిద్దరే 474 ఎకరాలపైకుపైగా భూమిని బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన వ్యాపార భాగస్వామి, బినామీగా భావిస్తున్న గూడూరు సురేష్ ద్వారా అసైన్డు భూములు కొనుగోలు చేశారు. మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు అసైన్డు భూముల కొనుగోలులో పోటీ పడ్డారని రైతులు తెలిపారు.
 
పచ్చి మోసం... పక్కా దగా!
అసైన్డు భూములు కొనుగోలు చేయడం.. విక్రయించడం చట్ట విరుద్ధం. కానీ.. ఆ భూములను కొనుగోలు చేయడంలో పచ్చ రాబందులు చతురత ప్రదర్శించారు. భూమిని కొనుగోలు చేసిన తర్వాత.. 25 శాతం సొమ్మును రైతులకు చెల్లించేటపుడు వీడియో, ఫోటోలు తీయిస్తున్నారు. ఆ భూములను 1954కు ముందే తమకు ప్రభుత్వం పంపిణీ చేసినట్లు.. తమ ఇష్టపూర్వకంగానే వాటిని అమ్మినట్లు హామీ పత్రం రాయించుకున్నారు. తక్కిన సొమ్మును ఆ భూమిని ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వం తీసుకుంటే ఇస్తామని.. లేదంటే మీ భూములు మీరే సాగు చేసుకోవచ్చునంటూ నమ్మబలికారు. కొందరు రిజిస్ట్రేషన్ చట్టాన్ని ఆసరాగా చేసుకుని..  ఆ శాఖ అధికారులతో భారీ ఎత్తున నజరానాలు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. మరికొందరు కోర్టు నుంచి ఎన్వోసీ(నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం) తెచ్చుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మంగళగిరి, అమరావతి, తుళ్లూరు, పెదకాకాని, గుంటూరు ఆర్వో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 480 ఎకరాల విక్రయానికి సంబంధించిన 499 రిజిస్ట్రేషన్లు చేశారు. మరో 650 ఎకరాల విక్రయానికి సంబంధించిన 381 పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేశారు.  మొత్తం మీద అధికారిక లెక్కల ప్రకారమే 348.46 ఎకరాల భూములను టీడీపీ నేతలు కొనుగోలు చేశారు. కొనుగోలు ఒప్పందాల ద్వారా మరో 1200 ఎకరాలకుపైగా భూములను సొంతం చేసుకున్నట్లు సమాచారం. రైతులను మభ్యపెట్టి, బెదిరించి ఎకరం కేవలం రూ.ఐదు లక్షలనుంచి రూ.40 లక్షలకే కొనుగోలు చేసిన భూముల విలువ ప్రస్తుతం ఎకరా రూ.1.75 కోట్లు పలుకుతుండటం గమనార్హం. అంటే... ఈ అసైన్డు భూములు కొనుగోలులోనే టీడీపీ నేతలు రూ.2,775 కోట్లు లాభపడ్డారు.
 
భూసమీకరణ నోటిఫికేషన్ బుట్టదాఖలు

రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 2,028 ఎకరాల అసైన్డు భూములు ఉన్నాయి. ఇందులో 1,278 ఎకరాల భూమిని 1954లో అసైన్డు చేశారు. తక్కిన 750 ఎకరాల భూమిని పలు దఫాల్లో రైతులకు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదలకు ప్రభుత్వం అరెకరం.. ఎకరం చొప్పున వాటిని అసైన్డు చేసింది. రాజధాని ప్రాంతం లో పట్టా, అసైన్డు భూముల సమీకరణకు మాత్రమే పరిహారం చెల్లించేలా జనవరి 1, 2015న ఉత్తర్వులు జారీ చేసింది.
     
పట్టా జరీబు భూములకు ఎకరానికి రూ.50 వేలు, మెట్ట భూములకు రూ.30 వేలు చొప్పున కౌలు ఇస్తామని అందులో పేర్కొంది.  అసైన్డు భూముల రైతులకు ఇదే తరహాలో కౌలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.పట్టా జరీబు భూముల రైతులకు ఎకరానికి వెయ్యి గజాల చొప్పున ఇంటి స్థలం, 450 గజాల చొప్పున వాణిజ్య స్థలం, మెట్ట భూముల రైతులకు ఎకరానికి వెయ్యి గజాల చొప్పున ఇంటి స్థలం, 200 గజాల చొప్పున వాణిజ్య స్థలం ఇవ్వాలని నిర్ణయించింది.అసైన్డు భూముల రైతులకు మెట్ట భూమి ఎకరానికి 800 గజాల చొప్పున ఇంటి స్థలం, వంద గజాల చొప్పున వాణిజ్య స్థలం.. అసైన్డు జరీబు భూమికి ఎకరానికి 800 చొప్పున ఇంటి స్థలం, 200 గజాల చొప్పున వాణిజ్య స్థలం ఇవ్వాలని నిర్ణయించింది.
 
అసైన్డు భూములకు ప్యాకేజీ ఓకే...
అస్మదీయులు అసైన్డు భూములు కొల్లగొట్టాక వాటికి ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 13న విజయవాడలో నిర్వహించిన ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసైన్డు భూముల కొనుగోలుదారులకు ఆ భూములపై హక్కులు కల్పించేలా చట్ట సవరణ చేయాలని ఆ సమావేశంలోనే ప్రాథమికంగా నిర్ణయించారు. ఆ మేరకు అసైన్డు చట్టాన్ని సవరించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలంటూ ఇటీవల సీసీఎల్‌ఏ (భూపరిపాలన కమిషనర్)ను ఆదేశించారు. అసైన్డు భూముల చట్టాన్ని సవరించడం ద్వారా తన కుమారుడు లోకేష్‌తోపాటూ అస్మదీయులకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చడానికి సీఎం చంద్రబాబు కుట్ర చేశారన్నది స్పష్టమవుతోంది. ఓ వైపు అసైన్డు భూముల అమ్మకాలను క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటోన్న సర్కారు.. మరోవైపు ఈనెల 17న అసైన్డు భూములకు ప్యాకేజీ ప్రకటించారు. 1954 కన్నా ముందు అసైన్డు చేసిన మెట్ట భూములకు ఎకరానికి వెయ్యి గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం, జరీబు భూములకు వెయ్యి గజాల ఇంటి స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ఇవ్వడానికి అంగీకరించారు. ఇక 1954 తర్వాత అసైన్డు చేసిన వాటికి మెట్ట భూములకు ఎకరానికి 800 గజాల ఇంటి స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం.. జరీబు భూములకు 800 గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇచ్చేందుకు అంగీకరించారు. ఇప్పుడు ఏడాదికి జరీబు అసైన్డు భూములకు రూ.50 వేలు.. మెట్ట భూములకు రూ.30 వేల  చొప్పున ఇచ్చే కౌలు చెక్‌లతోపాటూ ఇంటి, వాణిజ్య స్థలాలు కూడా మంత్రుల ఖాతాలోకే వెళ్లేలా నిబంధనలు రూపొందించడం గమనార్హం.
 
అధికారులే భయపెట్టారు
మా ముత్తాతల కాలంలో ప్రభుత్వం మాకు భూములను ఇచ్చింది. అన్నదమ్ములిద్దరి కుటుంబాలు 75 సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాము. భూసమీకరణ ప్రకటించడంతో కొంత ఆందోళన చెందాము. చాలాకాలం సమీకరణకు భూములు ఇవ్వలేదు. అయితే అసైన్డ్ భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని భూసమీకరణకు ఇస్తే మేలని అధికారులు,  నేతలు భయభ్రాంతులకు గురిచేయడంతో ఎట్టకేలకు సమీకరణకు ఇచ్చాము. ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. భూమి సాగు లేక పరిహారం అందక కుటుంబపోషణ భారంగా మారింది. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవట్లేదు. పట్టా భూముల మాదిరిగానే మాకు పరిహారం అందజేయాలి. పచ్చల నాగేశ్వర రావు, మోహన్‌రావు, నవులూరు
 
మూడు తరాలుగా సాగు చేసుకుంటున్నాం...
మూడు తరాలుగా ప్రభుత్వం ఇచ్చిన ఎకరా భూమిని సాగుచేసుకుని జీవిస్తున్నాము. భూసమీకరణకు ఇవ్వకపోవడంతో అధికారులు వచ్చి బెదిరించారు. ఆ భూములను ప్రభుత్వం కేటాయించిందని, సమీకరణకు ఇస్తే కొద్దిగానైనా పరిహారం వస్తుందని, లేదంటే భూములను ఊరకనే తీసుకుంటారని చెప్పడంతో సమీకరణకు ఇచ్చాము. అయినా అధికారులు పరిహారం ఇవ్వలేదు. వెంటనే పట్టాభూములు మాదిరిగా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
 వేమూరి జవహర్‌లాల్, నవులూరు
 
దళితులంటే సర్కారుకు చులకన

భూమిపై బ్రతికే కుటుంబాలు పరిహారం ఇవ్వకుంటే ఎలా బ్రతుకుతాయి? తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు పట్టా భూములకు ఇచ్చినట్లే పరిహారం అందించాలి. దళితులంటే ప్రభుత్వానికి చులకన కనుకే ఇంతకాలం పరిహారం ఇవ్వకపోగా ఇప్పుడు తక్కువ ప్రకటించింది. వెంటనే పట్టాభూములకు ఇచ్చినట్లే పరిహారం అందించాలి.  వేమూరి జాన్, నవులూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement