కళాశాలల్లో సీఐడీ, విజిలెన్స్ విచారణ
Published Thu, Aug 4 2016 12:16 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
భూపాలపల్లి : భూపాలపల్లిలోని ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బుధవారం సీఐడీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు మూడు బృందాలుగా విడిపోయి మూడు జూనియర్, మూడు డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ రికార్డులను, వసతులను పరిశీలించారు.
తరగతి గదులు, క్రీడా మైదానం, ల్యాబ్‌ల నిర్వహణ, అధ్యాపకుల అర్హత, విద్యార్థుల హాజరు తదితర వివరాలను పరిశీలించారు. అనంతరం సీఐడీ డీఎస్పీ రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. తాము గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్సై రమేష్, సిబ్బంది అంజయ్య, నరేందర్, విజిలెన్స్ తహసీల్దార్ భవాని, సిబ్బంది రాఘవరెడ్డి, అహ్మద్‌మియా ఉన్నారు.
విద్యార్థి సంఘాల ఫిర్యాదు..
అక్రమాలకు పాల్పడిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు విజిలెన్స్ తçహసీల్దార్ భవానికి వినతిపత్రం అందజేశారు. పలు కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లలో అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపించారు. వినతి పత్రం అందించిన వారిలో టీజేఎస్‌ఎఫ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుసుమ రామక్రిష్ణ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు కర్ణాకర్ ఉన్నారు.
Advertisement