ఏటీఎం నిందితుల నుంచి రూ.28.48 లక్షలు స్వాధీనం
ఏటీఎం నిందితుల నుంచి రూ.28.48 లక్షలు స్వాధీనం
Published Wed, Jun 14 2017 1:31 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లులో ఇటీవల ఏటీఎంలలో ఉంచాలి్సన నగదుతో ఉడాయించిన నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.28.48 లక్షలను స్వాధీనం చేసుకున్నట్టు నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల 3న పట్టణంలోని ఏటీఎంలలో నగదు పెట్టాలని విజయవాడకు చెందిన రైటర్ సేఫ్‌గార్డు ప్రైవేట్ సంస్థ తమ ఉద్యోగులు మీసాల రాజేంద్ర, యజ్జల రవీంద్రలకు రూ.32 లక్షలు నగదు ఇచ్చింది. వారు ఆ నగదును ఏటీఎంలలో పెట్టకుండా ఉడాయించినట్టు సేఫ్‌గార్డు సంస్థ భీమవరం బ్రాంచ్‌లో ఆఫీసర్–ఆపరేషన్స్‌గా పనిచేస్తున్న గుత్తికొండ వెంకట రమణ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ నగదును పాలకొల్లు, లంకలకోడేరు, ఆచంట, వేమవరం, మార్టేరు గ్రామాల్లో ఉన్న ఇండియా 1, యాక్సిస్, ఐసీఐసీఐ, ఇండి క్యాష్, సీబీఐ ఇలా 12 ఏటీఎంలలో నగదును ఉంచాల్సి ఉందన్నారు. నిందితులపై అనుమానంతో ఆ ఏటీఎంలను తనిఖీ చేయగా మరో రూ.14,47,600 దొంగిలించినట్టు బయటపడిందని తెలిపారు. మొత్తం రూ.46,47,600 నగదును వారు తమ అవసరాలకు వాడుకున్నట్టు గుర్తించామన్నారు. పట్టణ సీఐ బి.కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కె.రామకృష్ణ సోమవారం సాయంత్రం నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.28,48,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. రూరల్ సీఐ కె.రజనీకుమార్, కానిస్టేబుల్ జి.శ్రీను పాల్గొన్నారు.
Advertisement