విలేకర్ల ముందు ప్రవేశపెట్టిన దొంగలు, మాట్లాడుతున్న సీఐ
రణస్థలం : ఏటీఎంల్లో దొంగతనాలకు పాల్పడిన వారిని పట్టుకుని అరెస్టు చేశామని జేఆర్ పురం సీఐ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన వారిని విలేకరుల ముందు శనివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఈ నెల రెండో తేదీన రాత్రి ఎస్‌బీఐ ఏటీఎం తాళాలను పగులగొట్టి దొంగతనానికి ప్రయత్నించిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామని చెప్పారు. ముసుగులు వేసి దొంగతనానికి యత్నించారని తెలిపారు.
పట్టుబడిన వారంతా జేఆర్‌పురం గ్రామానికి చెందని వారని, వీరిలో ఒక మైనర్‌తో పాటు దుర్గాప్రసాద్, జె.దుర్గారావు, వనుమ గౌరీశంకర్, కె.ప్రసాద్ ఉన్నట్టు చెప్పారు. వీరిలో మైనర్‌ను మినహాయించి నలుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరంతా రిటైర్డ్ ఎంపీడీవో ఇంట్లో దొంగతనం చేసేందుకు పథకం పన్నారని ఆ సమయంలో వారింటికి బంధువులు రావడంతో ఏటీఎంపై కన్నేశారని చెప్పారు. పట్టుబడిన వారు గతంలో పలు నేరాలు చేసిన వారేనని పేర్కొన్నారు. రణస్థలం, జేఆర్‌పురం, పైడిభీమవరాల్లో చాలా దొంగతనాలు చేశారన్నారు. సీఐ వెంట ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.