దాగుడు’మూత’లు
దాగుడు’మూత’లు
Published Sun, Dec 11 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
ఏటీఎంల దుస్థితి
ఎప్పుడు పనిచేస్తాయో తెలియని వైనం
నగదు పెట్టినా గంటల్లో ఖాళీ
చేతిలో నగదు లేక..
జనం కష్టాలు తీవ్రం
ఓ వైపు బ్యాంకులకు వరుస సెలవులు.. మరోవైపు ఏటీఎంలు ఎప్పుడు పనిచేస్తాయో.. చేయవో తెలియని దుస్థితి.. చేతిలో నగదు లేదు. ఈ పరిస్థితుల్లో సామాన్యుడు నలిగిపోతున్నాడు. ఏం కొందామన్నా.. డబ్బులేక సతమతమవుతున్నాడు.
ఏలూరు (మెట్రో) :
పెద్దనోట్లు రద్దు చేసి నెలదాటినా జిల్లాలో పరిస్థితి గాడిలో పడలేదు. శనివారం నుంచి సోమవారం వరకూ బ్యాంకులకు సెలవులు కావడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని కొందరు ముందస్తుగానే కొంత సొమ్ము తీసి పక్కనబెట్టారు. ఆ సొమ్మూ ఆదివారానికి నిండుకుంది. మరోవైపు ఏటీఎంలు పనిచేయట్లేదు. కొన్ని ఎప్పుడు పనిచేస్తాయో.. ఎప్పుడు మూతపడతాయో తెలియట్లేదు. నగదు పెట్టినా క్షణాల్లో ఖాళీ అయిపోతున్నాయి. దీంతో జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వినియోగదారుల చేతుల్లో నగదు లేక మార్కెట్లు వెలవెలబోయాయి. మాంసాహార దుకాణాదారులు వరుసగా ఐదో ఆదివారమూ వ్యాపారాలు సరిగా సాగక ఉసూరుమన్నారు. వినియోగదారులంతా రూ.రెండువేల నోట్లే తీసకొస్తుండడంతో చిల్లర తేలేక వారు సతమతమయ్యారు.
జిల్లాలో 585 బ్యాంకులు ఉండగా, వీటికి అనుబంధంగా 594 ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంకులకు వరుస సెలవుల నేపథ్యంలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా.. రిజర్వుబ్యాంక్ దీనికి అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రజలకు కష్టాలు తప్పలేదు. జిల్లావ్యాప్తంగా ఆదివారం కేవలం 232 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. వాటిల్లోనూ కేవలం రూ.రెండువేల నోట్లే వచ్చాయి. అదీ కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే.
నోట్ల సమస్య పరిష్కారానికి చర్యలు
ఇదిలా ఉంటే నోట్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. రూ.1200 కోట్ల రూ.500 రూ.100 నోట్లను తెప్పించేందుకు యత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో ఈ నోట్లు చేరే అవకాశం ఉన్నట్టు వెల్లడిస్తున్నారు. అవి వస్తే 80శాతం ఇబ్బందులు తొలగే ఆస్కారం ఉంది.
మరోరెండు రోజులు తిప్పలు తప్పవు
మరో రెండు రోజులపాటు తిప్పలు తప్పవు. ఇప్పటికే జిల్లాకు అవసరమైన నోట్ల కొరతను రిజర్వు బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాం. మరో రెండు రోజుల్లో నోట్ల సమస్య తీరనుంది. జిల్లా వ్యాప్తంగా ఏటీఎం కేంద్రాల్లో రూ.2వేల నోట్లు అందుబాటులో ఉన్నాయి
ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, లీడ్‌బ్యాంకు మేనేజర్
చిల్లరకు తీవ్ర ఇబ్బంది
ఏటీఎంలలో రూ.2వేల నోటు మాత్రమే రావడంతో చిల్లర సమస్య తీవ్రంగా ఉంది. ఏ ఒక్క వస్తువు కొన్నా.. వినియోగదారులు పెద్దనోటే ఇస్తున్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. వ్యాపారాలు సాగడం లేదు.
పి.పూర్ణచంద్రరావు, వ్యాపారి
Advertisement
Advertisement