ఓ అత్త పెత్తనం... | atta,kodalu | Sakshi
Sakshi News home page

ఓ అత్త పెత్తనం...

Published Fri, Nov 18 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

ఓ అత్త పెత్తనం...

ఓ అత్త పెత్తనం...

 
ఆస్తి కోసం పండంటి బిడ్డతో కోడల్ని బయటపెట్టిన అత్త
ఇంట్లోకి రానిచ్చేది లేదని మొండిపట్టు
వణికించే చలిలో రామాలయంలోనే రాత్రంతా...
పోలీసుల జోక్యంతో వివాదం పరిష్కారం
కాకినాడ క్రైం : నిండు గర్భిణితో అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లి పండంటి బిడ్డతో తిరిగి వస్తే ఇంట్లోకి అడుగు పెట్టనీయని ఓ అత్త ఉదంతమిదీ. ఇరుగు, పొరుగు కుటుంబాలు సర్ది చెప్పినా ససేమిరా అనడంతో చివరకు పోలీసు స్టేషన్‌ వరకు విషయం వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే...తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని వేమగిరికి చెందిన వాసంశెట్టి శ్రీలక్ష్మి కాకినాడలోని ఇంద్రపాలెం పల్లపు వీధికి చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి గుత్తుల సత్యనారాయణ కుమారుడు శ్రీనివాసుని రూ.1.80 లక్షలు కట్నంగా ఇచ్చి 2015లో వివాహం చేసుకుంది. ఆ వెంటనే గర్భం దాల్చడంతో పురుడు కోసం గతేడాది పుట్టింటికి వెళ్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆనందంగా నెలల బిడ్డతో అత్తవారింటికి వచ్చిన ఆమెకు అత్త ప్రవర్తన ఆందోళనకు గురిచేసింది. బిడ్డతో వెళ్లేందుకు ఐదు, ఏడు, తొమ్మిది నెలల్లో ముహూర్తాలు పెట్టించినా ఏదో ఒక సాకుతో అత్త మంగ అడ్డంకులు సృష్టించడంతో అమ్మ సుభద్ర సాయంతో నేరుగా బిడ్డతో సహా అత్తింటికి బుధవారం రాత్రి చేరుకుంది. ఇంట్లోకి సంప్రదాయబద్ధంగా ఇంట్లోకి ఆహ్వానించాల్సిందిపోయి ‘రావద్ద’ంటూ అత్త తలుపులేసేయడంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. ఇరుగు పొరుగుతోపాటు ఆ వీధిలో పెద్దలు చెప్పినా ససేమిరా అనడంతో చేసేదేమీ లేక ... చంటిబిడ్డతో వెనక్కి వెళ్లలేక స్థానికంగా ఉన్న రామాలయ ఆవరణలో రాత్రంతా చలిలో ఇబ్బందులుపడ్డారు గురువారం ఉదయం వెళ్లి బతిమలాడినా మధ్యాహ్నం వరకూ మొండిపట్టు వీడలేదు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఇంద్రపాలెం ఎస్సై తిరుపతి రంగప్రవేశం చేసి శ్రీనివాస్‌ తండ్రి సత్యనారాయణ, రెండో భార్య మంగకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మాట వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరించడంతో సమస్య సద్దుమణిగింది. 
చలిలో ఇబ్బందులు పడ్డాం...
నెలల చంటి బిడ్డతో సారె, లాంఛనాలతో అత్తారింటికి వస్తే ఇలా చేయడం చాలా బాధ అనిపించిందని శ్రీలక్ష్మి తల్లి సుభద్ర వాపోయింది. తన అల్లుడు శ్రీనివాస్‌కు మంగ సవతి తల్లి కావడంతో ఇంట్లో ఉండనీయకుండా బయటకు పంపించే ఎత్తుగడ వేస్తోందని ఆమె ఆరోపించారు. ఆమెకు ఓ బిడ్డ ఉన్నాడని, ఈయనని ఇంట్లో పెట్టుకుంటే ఆస్తి ఇబ్బందులు వస్తాయని ఇలా చేస్తోందని సుభద్ర పోలీసులకు తెలిపారు.
 

Advertisement
Advertisement