అంతటా అటెన్షన్..!
అంతటా అటెన్షన్..!
Published Tue, Dec 6 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
* ఏఎన్‌యూలో నాక్ బృందం పర్యటన
* వర్సిటీ బడ్జెట్ రూపకల్పన , ఖాతాల వివరాల సేకరణ
* క్రీడా వసతులపై సంతృప్తి
* బుధవారంతో ముగియనున్న కమిటీ పర్యటన
ఏఎన్‌యూ: యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న సింథటిక్ ట్రాక్ అత్యున్నత క్రీడా ప్రమాణాల రూపకల్పనకు దోహదం చేస్తుందని నాక్ నిపుణుల బృందం అభిప్రాయపడింది. కమిటీ చైర్మన్ ఆచార్య హెచ్‌పి. ఖించా, పలువురు సభ్యులు మంగళవారం యూనివర్సిటీలోని క్రీడా కళాశాల, వసతి గృహం, భోజనశాలలు, క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం, నిర్మాణంలో ఉన్న ఫిజికల్ సెంటర్‌లను సందర్శించారు. ఏడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న సింథటిక్ ట్రాక్ వివరాలను ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య వై కిషోర్ కమిటీకి వివరించారు. ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో క్రీడా కారులు సాధించిన పతకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆచార్య ఖించా మాట్లాడుతూ ఏఎన్‌యూలో అత్యున్నత క్రీడా ప్రమాణాలు ఉన్నాయన్నారు. క్రీడారంగ అభివృద్ధికి ఏఎన్‌యూ మంచి చర్యలు చేపడుతుందని కితాబిచ్చారు. ఇవి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తాయన్నారు. చైర్మన్‌తోపాటు సభ్యులు ఆచార్య టీఎన్ మాథూర్, ఆచార్య ఎన్‌పి.శుక్లా, ఆచార్య టిæ. శ్రీనివాస్, ఆచార్య విజయ్ జుయాల్‌లు బృందాలుగా ఏర్పడి యూనివర్సిటీలోని పలు కార్యాలయాలను సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైబ్రరీని సందర్శించిన కమిటీ సభ్యులు పుస్తకాలు, జర్నల్స్‌ను పరిశీలించారు. లైబ్రేరియన్ ఆచార్య కె వెంకటరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను వీక్షించారు. అనంతరం రిఫరెన్స్ సెక్షన్లో విద్యార్థులతో మాట్లాడి లైబ్రరీలో అందుబాటులో ఉన్న సేవలపై ఆరా తీశారు. లైబ్రరీలో ఇంకేమైనా సేవలు కావాలని భావిస్తున్నారా అని అడిగి తెలుసుకుని వాటిని నమోదు చేసుకున్నారు. అనంతరం బృందం సభ్యులు యూనివర్సిటీ బాలుర, పరిశోధకుల వసతి గృహాలను సందర్శించారు. భోజన వసతిపై ఆరా తీశారు. మెస్ స్టోర్‌రూంలో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్‌ను సందర్శించారు. పీజీ అడ్మిషన్ల కార్యాలయాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలు, పీజీ, పరిశోధన కోర్సుల అడ్మిషన్లలో అమలు చేస్తున్న సంస్కరణలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షాభవన్‌లోని పరీక్షల కో-ఆర్డినేటర్ కార్యాలయం, రీసెర్చ్ సెల్ సందర్శించి పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, పరిశోధనాపరమైన సేవలను పరిశీలించారు.
ఆన్‌లైన్ సేవలు అందించాలని సూచన..
యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో యూజీసీ, అకౌంట్స్, ఎస్టాబ్లిష్‌మెంట్, అప్లియేషన్, అకడమిక్ సెక్షన్ల అధికారులు, సిబ్బందితో నాక్ బృంద సభ్యులు సమావేశమయ్యారు. యూనివర్సిటీ బడ్జెట్ రూపకల్పన, బిల్లులు, అడ్వాన్సుల చెల్లింపులు తదితర అంశాలను పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఆన్‌లైన్ సేవలు అందించాలని సూచించారు. దీనికి రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్ స్పందిస్తూ ఆన్‌లైన్ అకౌంట్స్ నిర్వహణకు ఏర్పాట్ల ప్రక్రియ సగం పూర్తయిందని తెలిపారు. కళాశాలలకు యూనివర్సిటీ అనుబంధం ఎలా ఇస్తుంది, పర్మినెంట్, టెంపరరీ అనుబంధాల్లో తేడా ఏమిటి, కళాశాలలు ఏ పత్రాలు సమర్పిస్తున్నాయి అనే అంశాలపై ఆరా తీశారు. సిబ్బంది నియామకం, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వారి మధ్య తేడా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు ఆచార్య రాజేందర్ సింగ్, ఆచార్య వసంత్ జుగాలే, ఆచార్య అరుణ్‌కుమార్‌ల బృందం ఒంగోలు పీజీ సెంటర్‌ను సందర్శించి అక్కడి మౌలిక వసతులు, నిర్వహణ కోర్సులు, పరిశోధనాంశాలు, సిబ్బంది వ్యవహారాలను పరిశీలించారు.
నివేదిక రూపకల్పనలో కమిటీ..
విభాగాలు, కార్యాలయాల సందర్శన సాయంత్రానికి పూర్తి చేసుకున్న కమిటీ విజయవాడ చేరుకుని పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలతో నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమైంది. బుధవారం మధ్యాహ్నానికి నివేదిక రూపకల్పన ప్రాథమికంగా పూర్తవుతుంది. అనంతరం యూనివర్సిటీకి వచ్చి వీసీతో సమవేశమవుతారు.
Advertisement
Advertisement