రోబో మేస్త్రీ..!
హైదరాబాద్: పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అని సామెత. ఈ కాలంలో మొదటిది అంత కష్టం కాకపోవచ్చుగానీ... ఇల్లు కట్టడం మాత్రం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనే. అయితే ఆస్ట్రేలియా కంపెనీ ఫాస్ట్‌బ్రిక్ రోబోటిక్స్ దీన్ని సులువు చేసేందుకు ఓ రోబో మేస్త్రీని తయారుచేసింది. 'హాడ్రియాన్ ఎక్స్' అని పిలుస్తున్న ఈ రోబో గంటలో వెయ్యి ఇటుకలతో గోడ కట్టేస్తుంది.
పెద్దసైజు లారీలో ఇమిడిపోయే హాడ్రియాన్‌కు దాదాపు 98 అడుగుల పొడవైన చేయి ఉంది. చేతి ద్వారా వచ్చే ఇటుకలను ఒక్కొక్కటిగా పేరుస్తూ చిటికెలో గోడలను నిర్మించేస్తుంది. ఇటుకలను క్రమపద్ధతిలో పేర్చడం కోసం హాడ్రియాన్ చేతి చివరలో ప్రత్యేకమైన పరికరాన్ని అమర్చారు. ఇటుక సైజును బట్టి ఏ ఇటుక పక్కన పేర్చాలి అనే నిర్ణయాన్ని కూడా దానంతట అదే తీసుకుంటుంది. మనుషులు ఏ విధంగా ఇటుక సైజులను సరిచేసుకుంటూ ఇటుక ఇటుకకు మధ్య సిమెంట్ ను ఉంచుతారో.. అచ్చూ అలానే రోబో కూడా చేస్తుండటం విశేషం.
సరైన సైజు లేని ఇటుకను లేజర్ సాయంతో తగిన విధంగా మలుచుకునే ఏర్పాట్లు రోబోకు ఉన్నాయి. ఇటుక ఇటుకకు మధ్య సిమెంట్ ను వేయడానికి కూడా ప్రత్యేకంగా కొన్ని వసతులు ఏర్పాటు చేశారు. హాడ్రియాన్ తో తాపీ మేస్త్రీలతో అవసరం లేకుండా కేవలం రెండు రోజుల్లో ఒక ఇంటి గోడలన్నీ కట్టేయోచ్చని తయారీదారులు చెబుతున్నారు. ఏడాది పొడవునా.. రోజంతా హాడ్రియాన్ తో పనిచేయించినా దీనికి అలసట ఉండదని సృష్టికర్త మార్క్ పివాక్ అంటున్నారు.