House building
-
మా సొంతింటి కల నెరవేరబోతోంది
-
నీ ఇల్లు బంగారం గానూ!
సాక్షి, సిటీబ్యూరో: ఇల్లు నిజంగానే బంగారమైపోయింది. లగ్జరీ ఇంటీరియర్‌కు 24 క్యారెట్ గోల్డ్ లీఫింగ్తో (పైన పూత) ఇంటిని తీర్చిదిద్దుతున్నారు నగరవాసులు. ప్రధాన ద్వారం మొదలు కార్పెట్లు, కర్టెన్లు, వాల్ పేపర్స్, లైట్లు, సీలింగ్, ఫర్నిచర్ వరకూ ప్రతీది బంగార వర్ణంతో మెరిసిపోతుంది. టర్కీ, ఇటలీ వంటి దేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్‌ను దిగుమతి చేసుకొని మరీ ఇంటిని బంగారుమయం చేసేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లడం లేదు. వీకెండ్స్, హాలీడే ట్రిప్స్ లేవు. గతంలో రోజులో 8–10 గంటలు మాత్రమే ఇంట్లో గడిపేవాళ్లు. మిగిలిన సమయం ఆఫీసులో, ప్రయాణంలో, ఇతరత్రా అవసరాలకు పోయేవి. కానీ ఇప్పుడు కరోనా, వర్క్ ఫ్రం హోమ్ ఇతరత్రా కారణాలతో ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో వినోదం, ఆనందం కోసం బయట చేసే ప్రతి పనినీ ఇంట్లో ఉంటూనే ఆస్వాదించాలనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఇంటిని, ఇంట్లోని ప్రతి వసతులను ఆధునికంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం బయట జిమ్, స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లే వారు ఇప్పుడు అవే వసతులు, ఔట్‌డోర్ జిమ్‌లను కల్పించే గేటెడ్ కమ్యూనిటీలను వెతుకుంటున్నారు. వీకెండ్స్‌లో సినిమాకు వెళ్లే బదులు.. ఓవర్ ది టాప్ (ఓటీటీ), నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిల్లో ఇంట్లోనే థియేటర్ అనుభూతి కల్పించే హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనాకు ముందు కంటే హైఎండ్ నగరవాసుల వినియోగ వ్యయం తగ్గింది. దీనిని లగ్జరీ ఇంటీరియర్ కోసం వెచ్చిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి... ఇటలీ, టర్కీ, ఈజిప్ట్ దేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్ దిగుమతి అవుతున్నాయి. ఇంటీరియల్లో వినియోగించే ఉత్పత్తుల్లో 60 శాతం ఆయా దేశాల నుంచే దిగుమతి అవుతుంటాయని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ కే ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తలుపులు, డైనింగ్ టేబుల్స్, బెడ్స్, వాల్ పేపర్స్, కర్టెన్స్, మ్యాట్స్, లైట్లు, మార్బుల్స్, టైల్స్, ఫర్నిచర్, శాండిలియర్స్, బాత్ ఫిట్టింగ్స్, ల్యాండ్ స్కేపింగ్, పెయింటింగ్స్, శిల్పాలు.. ఇలా ప్రతి ఒక్కటీ దిగుమతి చేసుకుంటునన్నారు. విభిన్న డిజైన్స్, లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తులు దొరకడమే దిగుమతి చేసుకోవటానికి ప్రధాన కారణం. గతంలో హోమ్ డిజైనింగ్‌లో ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ మాత్రమే భాగస్వామ్యమయ్యే వారు. కానీ, ఇప్పుడు శిల్పులు, చిత్రకారులు కూడా వీరితో జతకట్టి నివాసితులకు ఆధునిక అనుభూతిని కల్పించేలా గృహాలను తీర్చిదిద్దుతున్నారు. లిమిటెడ్ ఎడిషన్స్లలో కొన్ని బ్రాండ్లు... పలు లగ్జరీ కార్ల కంపెనీలు బెంట్లీ, పోర్షే వంటివి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాయి. ఇటలీకి చెందిన ఫెండి కాసా, జియోర్జెట్టి, రోబర్టో కావల్లీ, ట్రుసార్జీ కాసా, ఎట్రో హోమ్, జంబో, జియాన్ఫ్రాంకో ఫెర్రే హోమ్, న్యూయార్క్‌కు చెందిన రాల్ఫ్ లారెన్ హోమ్, యూకేకు చెందిన బెంట్లీ హోమ్, ప్యారిస్‌కు చెందిన బకారట్ లా మైసన్, ఫ్రాన్స్‌కు చెందిన రిట్జ్ పారిస్, బుగట్టీ హోమ్.. ఇవన్నీ అంతర్జాతీయ ఇంటీరియర్ బ్రాండ్లు. క్లాసిక్ స్టయిల్లో చేతితో తయారు చేస్తారు. నాణ్యత, డిజైనింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. నగరంలో లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్.. మైహోమ్, అపర్ణా, రాజపుష్ప, ముప్పా వంటి ప్రాజెక్ట్‌లతో నాలుగైదుగురితో పాటు జూబ్లిహిల్స్ రోడ్ నం.45, గచ్చిబౌలిలోని ఇద్దరు వ్యక్తిగత కస్టమర్లు పూర్తిగా టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న 24 క్యారెట్ల గోల్డ్ లీఫింగ్తో ఇంటీరియర్ చేయించుకున్నారు. గిరిధారి, ప్రణీత్, ఎస్ఎంఆర్ తదితర సంస్థలు క్లబ్‌హౌస్‌లను విదేశీ ఇంటీరియర్ ఉత్పత్తులతో ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాయి. సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నేతలు తమ గృహాలను లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌తో రాజభవనాల లాగా తీర్చిదిద్దుతున్నారు. కార్మికులూ విదేశాల నుంచే.. ఈ తరహా ఇంటీరియర్స్‌ను ఇక్కడి కార్మికులు చేయలేరు. అందుకే ఈజిప్ట్ నుంచి ఇంటీరియర్ నిపుణులు వచ్చి డిజైనింగ్ చేస్తుంటారని తాయబా తెలిపారు. 10 వేల చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాలకు మాత్రమే ఈ తరహా లగ్జరీ ఇంటీరియర్స్ బాగుంటాయి. వీటి ధరలు చదరపు అడుగుకు రూ.800 నుంచి 4,500 వరకు ఉంటాయి. ప్రాజెక్ట్ మొత్తానికి రూ.5–10 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంటీరియర్ డిజైన్ పూర్తి చేసేందుకు 30–90 రోజుల సమయం పడుతుంది. కళ్లు తిరిగే ధరలు.. ►బెంట్లీ సోఫా. వీటి ప్రారంభ ధర రూ.30 లక్షల నుంచి ఉంటుంది. పోర్షే కిచెన్ సెట్స్ ప్రారంభ ధర రూ.కోటి నుంచి మొదలవుతుంది. ►అర్మానీ కాసా ఫర్నీచర్, టైల్స్. వీటిని ఆఫ్రికాలో పెరిగే కొన్ని అరుదైన రకాల వృక్షాల నుంచి ఈ ఫర్నీచర్‌ను తయారు చేస్తారు. వీటి ప్రారంభ ధర రూ.50 లక్షల పైమాటే. ►‘ట్రీ ఆఫ్ లైఫ్’ అనే 30–40 ఏళ్ల నాటి అరుదైన వృక్షాలను ఆఫ్రికా దేశం నుంచి దిగుమతి చేసుకొని ల్యాండ్స్కేపింగ్గా వినియోగిస్తుంటారు. ►జపాన్‌కు చెందిన టోటో, జర్మనీకి చెందిన నోకెన్ బాత్రూమ్ అండ్ శానిటైజ్ ఫిట్టింగ్స్‌లో గ్లోబల్ బ్రాండ్లు. ఆయా ఉత్పత్తుల ప్రారంభ ధరలు రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఆటోమెటెడ్ టాయిలెట్, షవర్స్, బాడీ జెట్స్ ఉత్పత్తులు వీటి ప్రత్యేకత. టాయిలెట్ పైన కూర్చుంటే చాలు వాతావరణాన్ని బట్టి ఆటోమెటిక్‌గా అదే నీటిని పంపింగ్ చేస్తుంది. శరీర ఉష్ణోగత్రను బట్టి మారుతూ ఉంటుంది. షవర్స్, బాడీజెట్స్ శ్రావ్యమైన మ్యూజిక్, లైటింగ్స్‌తో పైనుంచి వర్షం పడినట్లుగా వస్తుంటుంది. ►డెఫా లైటింగ్ సొల్యూషన్స్ మనిషి మూడ్‌ను, ఉష్ణోగ్రతను బట్టి గదిలో వెలుతురును ఇవ్వటం దీని ప్రత్యేకత. ప్రముఖ జువెల్లరీ బ్రాండ్ స్వరోస్క్వీ.. శాండిలియర్స్ను కూడా విక్రయిస్తుంది. వీటి ప్రారంభ ధర రూ.10 లక్షలు. ►అమెరికాకు చెందిన జేబీఎల్, డెన్మార్క్‌కు చెందిన డాలీ, డైనడియా, జపాన్‌కు చెందిన డినాన్, ఫ్రాన్స్‌కు చెందిన డెవిలెట్, ఫోకల్ వంటివి థియేటర్ అనుభూతిని కల్పించే హోమ్ థియేటర్స్ గ్లోబల్ బ్రాండ్లు. కరోనా కారణంగా ప్రయాణాలు కుదరడం లేదు రెసిడెన్షియల్, కమర్షియల్, ఇనిస్టిట్యూషనల్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైన్స్ చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు నగరాలలో 50–60 ప్రాజెక్ట్స్ ఆర్డర్లు ఉన్నాయి. కరోనా కారణంగా విదేశాలకు వెళ్లి ఇంటీరియర్స్‌ను ఎంపిక చేయడం కుదరటం లేదు. – జీ రామ్మోహన్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ ప్యాలెస్‌లు తీర్చిదిద్దడం మా ప్రత్యేకత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అహ్మదాబాద్ నగరాల్లో 55 వేల చదరపు అడుగులలో పలు ప్రాజెక్ట్‌ల ఆర్డర్లు ఉన్నాయి. టర్కీ, ఇటలీ రాయల్ ఫర్నిచర్‌తో లండన్, దుబాయ్, సౌదీ ప్యాలెస్ వంటి కాన్సెప్ట్‌లతో ఇంటీరియర్‌ను డిజైన్ చేయడం మా ప్రత్యేకత. పదేళ్ల వారంటీ కూడా ఉంటుంది. – తాయ్యబా, ఎండీ, బెనోయిట్ ఫర్నీచర్ -
మానవత్వం చాటుకున్న మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట : పదేళ్ల క్రితం ఆ ఇంటి పెద్ద గుండె ఆగిపోయింది. ప్రకృతి పగబట్టినట్టు వర్షాల కారణంగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న ఇల్లు కాస్తా కూలిపోయింది. మగదిక్కులేకుండా వయసులో ఉన్న కూతురుతో తల్లి దొంతరబోయిన బాలవ్వ సర్కారు బడి లో తలదాచుకుంది. సిద్దిపేట జిల్లా చిన్నకో డూరు మండలం రామంచకి చెందిన వీరి దీనస్థి తిని సెప్టెంబర్ 23న ‘సారూ.. సాయం చేయరూ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. నిరుపేదల గోడు విని సొంత ఖర్చుతో ఇల్లు కట్టించారు. శనివారం దగ్గరుండి తల్లీకూతుళ్లకు కొత్త బట్టలు పెట్టి గృహ ప్రవేశం చేయించారు. నాడు కూలిన ఇల్లు.. నేడు కొత్తగా నిర్మించిన ఇల్లు -
కంటెయినర్ ఇళ్లొచ్చాయ్!
మొయినాబాద్(చేవెళ్ల)/కందుకూరు: చూడముచ్చటైన సోఫాలతో హాల్, అబ్బురపరిచే కిచెన్, బెడ్రూమ్లు, ఔరా అనిపించే ఇంటీరియర్. ఇది చాలా ఇళ్లలో ఉంటుంది కదా అని అనుకుంటున్నారా?. కానీ ఈ ఇళ్లు మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకునిపోవచ్చు. కొద్దిరోజులు విహారయాత్రలకు వెళ్లినా వీటిని మనతోనే తీసుకెళ్లొచ్చు. ఇవే కంటెయినర్ ఇళ్లు. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వీటి నిర్మాణంవైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. ట్రెండ్‌కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం ఇలా మారుతోంది. కొన్నిచోట్ల ఆఫీసులుగా మారుతున్నాయి. బయటకు సాధారణంగానే కనిపించినా.. లోపల మాత్రం సకల హంగులు ఉంటున్నాయి. సులభంగా తరలింపు... రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా ఓ షెడ్ ఉండాలని భావిస్తున్నారు. చిన్న గది కట్టాలన్నా ఇటుకలు, ఇసుక, సిమెంటు, రేకులు తదితర సామగ్రి కావాలి. పని పూర్తయిన తరువాత దానిని కూల్చి వేయాల్సిందే. వీటికి ప్రత్యామ్నాయంగా కంటెయినర్లలో ఆఫీసులు ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిని సులభంగా తరలించే అవకాశం ఉండటంతో కూడా ఎక్కుమంది మొగ్గు చూపుతున్నారు. చదరపు అడుగుకు రూ.1,200... 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ప్రారంభించి 30/10, 40/10, 40/20, 40/8 ఇలా పలు కొలతల్లో కంటెయినర్ ఇళ్లు, కార్యాలయాలను తయారు చేసి ఇస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్లతో పాటు విద్యుత్, ఫ్యాబ్రికేషన్ తదితరాలను, ఫర్నిచర్, టాయిలెట్స్ సమకూర్చి అందజేస్తున్నారు. ఒక చదరపు అడుగు విస్తీర్ణం సుమారుగా రూ.1,200–1,500 వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. 20/10 కంటెయినర్ ఇల్లు ఏర్పాటుకు రూ.1.85–2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతోపాటు టాయిలెట్, ఫర్నిచర్‌కు అదనంగా మరో రూ.60 వేలు వరకు తీసుకుంటున్నారు. 40/10 కంటెయినర్ దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కానుంది. కంటెయినర్‌ను బట్టి దాని జీవితకాలం 20–30 ఏళ్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. కంటెయినర్ ఇళ్లు, ఆఫీసులను శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ పక్కన, నగరంలోని జీడిమెట్లలో తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆసక్తిని బట్టి తయారీ వినియోగదారుడి ఆసక్తి మేరకు వివిధ రకాల సైజుల్లో కంటెయినర్లను తయారు చేసి ఇస్తున్నాం. ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లతో పాటు ప్రాజెక్టుల వద్ద అవసరమైన ఆఫీస్ రూమ్‌లు, లేబర్ క్వార్టర్స్, టాయిలెట్లు, బాత్రూమ్లు తదితరాలను నిర్మించి ఇస్తున్నాం. సాధారణంగా మెటల్ మందం 1.2 మి.మీ., లోపల ఇన్సూలేషన్ 50 మి.మీ.తో ఇస్తాం. మందం పెరిగితే ధర పెరుగుతుంది. కంటెయినర్లో ఏర్పాటు చేసుకునే వసతుల్ని బట్టి ధర మారుతుంటుంది. ఆర్డర్ ఇచ్చిన వారం పది రోజుల్లో సరఫరా చేస్తాం. – కృష్ణంరాజు సాగి, నిర్వాహకుడు, ఆర్ఈఎఫ్ టెక్నాలజీస్, జీడిమెట్ల -
రాజీవ్‌కాలనీలో ఉద్రిక్తత
కంచరపాలెం(విశాఖ ఉత్తర): జీవీఎంసీ 43వ వార్డు కంచరపాలెం పరిధి రాజీవ్‌కాలనీ వద్ద మంగళవారం వేకువజామున తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు రేకుల షెడ్లు తొలగించేందుకు యత్నించగా స్థానిక నివాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. జేసీబీతో ఇళ్లు తొలగిస్తున్న సమయంలో వాహనాలను తమపై నుంచి పోనివ్వాలని బైఠాయించారు. అయినప్పటికీ అధికారులు వెనక్కు తగ్గలేదు. రంగంలోకి దిగిన కంచరపాలెం, ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు బాధితులను చెదరగొట్టారు. ఇళ్ల తొలగింపును అడ్డుకునే క్రమంలో ఓ మహిళకు ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు హుటాహుటిన అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... రాజీవ్‌కాలనీ ప్రాంతంలో ఉన్న సుమారు నాలుగు ఎకరాల రైల్వే స్థలంలో 275 కుటుంబాల వారు సిమెంటు రేకుల షెడ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. మురికివాడల అభివృద్ధిలో భాగంగా కాలనీలోని నివాసితులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. కాలనీ స్థలం రైల్వేకు సంబంధించినది కావడంతో స్థల మార్పిడిలో భాగంగా రాజీవ్‌కాలనీలో నివాసం ఉంటున్న సుమారు 65మందికి కొమ్మాది వద్ద నిర్మించే జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం హౌసింగ్ స్కీమ్‌లో కేటాయించారు. మిగిలిన 210 కుటుంబాల ప్రజలకు రాజీవ్‌కాలనీ వద్ద జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇళ్లు నిర్మించేందుకు ఇటీవలే ఏపీ టీడ్కో సంస్థకు నిర్మాణ పనులు జీవీఎంసీ అప్పగించింది. ఇందులో భాగంగా వారం రోజుల నుంచి రాజీవ్‌కాలనీ ప్రాంతవాసులకు ఇక్కడి ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో షెడ్లు తొలగించామని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు. టీడీపీ నాయకుల వల్లే తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇళ్లను తొలగించారని, దీని వెనుక స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల హస్తం ఉంద ని, వారే తమకు అన్యాయం చేశారని నివాసితులు ఆరోపించారు. స్థానిక టీడీపీ నాయకులు ఇళ్ల కేటాయింపులో చేతివాటం ప్రదర్శిం చారని స్థానికురాలు పాడి కాంచన ఆరోపించింది. సక్రమంగా ఇంటి పన్నుతోపాటుగా కరెంటు బిల్లు చెల్లిస్తున్నామని.. అయినప్పటి కీ తమకు చెప్పకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇళ్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు రోడ్డున పడ్డామని వాపోయారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తొలగింపు చర్యల్లో అర్బన్ తహసీల్దార్ నాగభూషణ్, పశ్చిమ జోన్ ఏసీపీ లంక అర్జున్, జీవీఎంసీ డీసీపీ రాంబాబు, వివిధ జోన్ల టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు మధుసూదనరావు, సత్యనారాయణ, నాయుడు, టీపీవోలు విజయ్‌కుమార్, శ్రీలక్ష్మి, ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు సూర్యనారాయణ, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రోబో మేస్త్రీ..!
హైదరాబాద్: పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అని సామెత. ఈ కాలంలో మొదటిది అంత కష్టం కాకపోవచ్చుగానీ... ఇల్లు కట్టడం మాత్రం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనే. అయితే ఆస్ట్రేలియా కంపెనీ ఫాస్ట్బ్రిక్ రోబోటిక్స్ దీన్ని సులువు చేసేందుకు ఓ రోబో మేస్త్రీని తయారుచేసింది. 'హాడ్రియాన్ ఎక్స్' అని పిలుస్తున్న ఈ రోబో గంటలో వెయ్యి ఇటుకలతో గోడ కట్టేస్తుంది. పెద్దసైజు లారీలో ఇమిడిపోయే హాడ్రియాన్కు దాదాపు 98 అడుగుల పొడవైన చేయి ఉంది. చేతి ద్వారా వచ్చే ఇటుకలను ఒక్కొక్కటిగా పేరుస్తూ చిటికెలో గోడలను నిర్మించేస్తుంది. ఇటుకలను క్రమపద్ధతిలో పేర్చడం కోసం హాడ్రియాన్ చేతి చివరలో ప్రత్యేకమైన పరికరాన్ని అమర్చారు. ఇటుక సైజును బట్టి ఏ ఇటుక పక్కన పేర్చాలి అనే నిర్ణయాన్ని కూడా దానంతట అదే తీసుకుంటుంది. మనుషులు ఏ విధంగా ఇటుక సైజులను సరిచేసుకుంటూ ఇటుక ఇటుకకు మధ్య సిమెంట్ ను ఉంచుతారో.. అచ్చూ అలానే రోబో కూడా చేస్తుండటం విశేషం. సరైన సైజు లేని ఇటుకను లేజర్ సాయంతో తగిన విధంగా మలుచుకునే ఏర్పాట్లు రోబోకు ఉన్నాయి. ఇటుక ఇటుకకు మధ్య సిమెంట్ ను వేయడానికి కూడా ప్రత్యేకంగా కొన్ని వసతులు ఏర్పాటు చేశారు. హాడ్రియాన్ తో తాపీ మేస్త్రీలతో అవసరం లేకుండా కేవలం రెండు రోజుల్లో ఒక ఇంటి గోడలన్నీ కట్టేయోచ్చని తయారీదారులు చెబుతున్నారు. ఏడాది పొడవునా.. రోజంతా హాడ్రియాన్ తో పనిచేయించినా దీనికి అలసట ఉండదని సృష్టికర్త మార్క్ పివాక్ అంటున్నారు. -
ప్రింటు కొట్టు ఇల్లు కట్టు..!
మనుషుల్లేకుండా ఇల్లు కట్టడం సాధ్యమైతే..? పగుళ్ల బారిన రోడ్లు... పైసా ఖర్చు లేకుండా వాటంతట అవే రిపేరైతే...? రహదారులు.. కార్లకు కరెంటు సప్లై చేస్తే? ఎలా ఉంటుంది? మహా అద్భుతం అవుతుందంటున్నారా? నిజమే... థ్యాంక్స్ టు టెక్నాలజీ. ఇంకొన్నేళ్లు పోతే ఇవన్నీ సాధ్యమే! ఒకప్పటి మాట. ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం మట్టి, రెల్లుగడ్డి ఉంటే సరిపోయేది. రోమన్లు కాంక్రీట్‌ను ఆవిష్కరించడంతో పరిస్థితి మారిపోయింది. బోలెడంత మంది కూలీల శ్రమ తోడై అద్భుతమైన భవనాలు రూపొందాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇల్లైనా, స్కై స్క్రాపరైనా, బ్రిడ్జిలైనా... ఇలా ఏ నిర్మాణమైనా కాంక్రీట్ తప్పనిసరైపోయింది. ఇకపై మాత్రం అలా ఉండదంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. విషవాయు వుగా చెప్పుకుంటున్న కార్బన్డైయాక్సైడ్నే ఇటుకలుగా మార్చేయడం మొదలుకొని మనుషుల అవసరమే లేకుండా రోబోల సాయంతోనే ఇళ్లు కట్టడం వరకూ అనేకానేక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పగుళ్లు మాయం వానా కాలం వచ్చిందంటే చాలు.. రోడ్లన్నీ పగుళ్లుబారిపోవడం... గుంతలు పడిపోవడం మనం చూస్తూంటాం. ఐదేళ్ల క్రితం రోడ్ ఐల్యాండ్ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించాడు. స్మార్ట్ కాంక్రీట్‌ను తయారు చేశాడు. ఈ కాంక్రీట్‌తో వేసిన రోడ్లు పగుళ్లుబారితే... ఎవరూ రిపేర్ చేయాల్సిన అవసరముండదు. కొద్ది సమయం తరువాత పగుళ్లన్నీ వాటంతట అవే మూసుకుపోతాయి. సోడియం సిలికేట్‌తో తయారైన అతిసూక్ష్మమైన గుళికలను కాంక్రీట్‌కు జత చేయడం ఈ స్మార్ట్ కాంక్రీట్ వెనుక ఉన్న కిటుకు. పగులు ఏర్పడినప్పుడు ఈ సోడియం సిలికేట్ గుళికలు ఒకరకమైన ద్రవాన్ని విడుదల చేస్తాయి. ఈ ద్రవం జిగురులా పనిచేసి పగుళ్లను మూసేస్తుంది. కొంతమంది ఇతర శాస్త్రవేత్తలు సోడియం సిలికేట్ స్థానంలో బ్యాక్టీరియాను, ప్లాస్టిక్ క్యాప్సూల్స్‌ను వాడి ఇదే ఫలితాలను సాధించారు. వైరింగ్, ప్లంబింగ్లు కలిపి... త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అంతగా అందుబాటులోకి రాకమునుపు అంటే సుమారు పదేళ్ల క్రితమే అమెరికా శాస్త్రవేత్త బెహ్రోక్ ఖోష్నవిస్ కాంటూర్ క్రాఫ్టింగ్ పేరుతో రోబోటిక్ ఇంటి నిర్మాణానికి ఓ వ్యవస్థను తయారు చేశారు. కాంక్రీట్‌ను ఓ గొట్టం ద్వారా బలంగా పంప్ చేయడం ఈ టెక్నాలజీలోని కీలకాంశం. కాంక్రీట్ పొరలను వరుసగా పేర్చుకుంటూపోతే గోడలు తయారవుతాయి. నిర్మాణ సమయంలోనే ఎలక్ట్రిక్ వైరింగ్ మొదలుకొని, ప్లంబింగ్ వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. ఫలితంగా అతితక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తవుతుంది. భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలను నిర్మించేందుకు ఈ టెక్నాలజీ పనికొస్తుందని భావిస్తున్నారు. బరువు తక్కువ.. శక్తి ఎక్కువ గాలికంటే తేలికగా ఉంటుంది... కానీ శక్తి మాత్రం ఉక్కు కంటే ఎక్కువే. ఏమిటో చెప్పుకోండి? నానోట్యూబ్‌లు! అవును మీటర్లో వందకోట్ల కంటే తక్కువ మందముండే ఈ నానోట్యూబ్‌లు ఎంతో శక్తి కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిని నిర్మాణాల్లో ఉపయోగించామ నుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ సైజులోనే సెన్సర్లు కూడా తయారు చేస్తే వాటిని నిర్మాణాల్లో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఉపయోగించుకోవచ్చు. కార్బన్‌డైయాక్సైడ్ ఇటుకలు ప్రపంచం మొత్తమ్మీద కార్లు, పవర్ప్లాంట్ల ద్వారా వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్‌డైయాక్సైడ్ వాయువు ఎంతో మీకు తెలుసా? దాదాపు 3000 కోట్ల టన్నులు! వాతావరణ మార్పుల ప్రభావాన్ని తప్పించుకునేందుకు ఒకవైపు దీని మోతాదును తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మరోవైపు వాతావరణంలోకి చేరే ఈ విషవాయువునే మన అవసరాలు తీర్చుకునే వనరుగా మార్చేందుకూ ప్రయోగాలు జరుగుతున్నాయి. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకడుగు ముందుకేసి బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవి సాయంతో ఈ వాయువును ఘన పదార్థంగా మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్రక్రియ ద్వారా తయారయ్యే కాల్షియం కార్బొనేట్‌ను ఇటుకల్లా వాడటం ద్వారా కార్బన్‌డైయాక్సైడ్‌ను వాతావరణంలోంచి తొలగించడంతోపాటు దాన్ని నిరపాయకరంగా భవనాల రూపంలో నిల్వ చేయవచ్చు. కరెంటునిచ్చే రోడ్లు రోడ్లపై వెళుతున్నప్పుడు ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ అవుతూంటే....? భలే ఉంటుంది. స్మార్ట్ఫోన్లను వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ చేసుకుంటాం కదా.. అచ్చంగా ఇదే పద్ధతిలో పనిచేస్తుంది ఈ కార్ల ఛార్జింగ్ కూడా. కాకపోతే ఇందుకోసం రోడ్లన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుంది. న్యూజీలాండ్‌లోని ఓ కంపెనీ ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఇలాంటి ఓ రోడ్డు నిర్మించి విద్యుత్ వాహనాలను ఉపయోగిస్తోంది. రహదారుల్లోనే గాజుతో తయారైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాహనాలకు అందివ్వడం ఈ ప్రాజెక్టులోని కీలకాంశాలు. ఇదిలా ఉండగా రహదారులు పీల్చుకునే సూర్యరశ్మి తాలూకూ వేడిని కూడా విద్యుత్తుగా మార్చి వాడుకునేందుకు కొన్నిచోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను వాడటం ద్వారా రోడ్లపై కదిలే వాహనాల కంపనాలను కూడా విద్యుత్తుగా మార్చే టెక్నాలజీలు సిద్ధమవుతున్నాయి. - గిళియార్ ఇల్లు కట్టే ప్రింటర్ త్రీడీ ప్రింటర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. కాగితపు ప్రింటర్ల మాదిరిగా కాకుండా ఇవి వస్తువులను ప్రింట్ చేసి ఇస్తాయి. భవిష్యత్తులో మాత్రం ఏకంగా ఇల్లు మొత్తాన్ని ఈ టెక్నాలజీ ద్వారా నిర్మించుకోవచ్చు. నెదర్లాండ్స్‌కు చెందిన కంపెనీ ‘దస్’ ఇప్పటికే ఇలాంటి ప్రింటర్ సాయంతో ఓ ప్లాస్టిక్ ఇల్లు కట్టేసింది కూడా. కామేర్మేకర్ పేరుతో ఈ కంపెనీ తయారు చేసిన భారీ ప్రింటర్ కొన్ని రోజుల వ్యవధిలోనే లెగో బ్లాక్స్‌ను చేర్చినట్టు ఇంటి గదులను కట్టి, పేర్చింది. మరోవైపు ఓ చైనా కంపెనీ సిమెంట్ కాంక్రీట్లను ఉపయోగించి భారీ ఫ్రేమ్‌లను తయారు చేసి... వాటితో గదులను తయారు చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన ఇళ్ల ఖరీదు రూ.మూడు లక్షలకు మించకపోవడం గమనార్హం.