నీ ఇల్లు బంగారం గానూ!  | Luxury Interior Home With 24 Carat Gold Leafing | Sakshi
Sakshi News home page

నీ ఇల్లు బంగారం గానూ! 

Published Fri, Oct 15 2021 1:30 AM | Last Updated on Fri, Oct 15 2021 4:09 AM

Luxury Interior Home With 24 Carat Gold Leafing - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఇల్లు నిజంగానే బంగారమైపోయింది. లగ్జరీ ఇంటీరియర్‌కు 24 క్యారెట్‌ గోల్డ్‌ లీఫింగ్‌తో (పైన పూత) ఇంటిని తీర్చిదిద్దుతున్నారు నగరవాసులు. ప్రధాన ద్వారం మొదలు కార్పెట్లు, కర్టెన్లు, వాల్‌ పేపర్స్, లైట్లు, సీలింగ్, ఫర్నిచర్‌ వరకూ ప్రతీది బంగార వర్ణంతో మెరిసిపోతుంది. టర్కీ, ఇటలీ వంటి దేశాల నుంచి లిమిటెడ్‌ ఎడిషన్‌ ఇంటీరియర్స్‌ను దిగుమతి చేసుకొని మరీ ఇంటిని బంగారుమయం చేసేస్తున్నారు. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లడం లేదు. వీకెండ్స్, హాలీడే ట్రిప్స్‌ లేవు. గతంలో రోజులో 8–10 గంటలు మాత్రమే ఇంట్లో గడిపేవాళ్లు. మిగిలిన సమయం ఆఫీసులో, ప్రయాణంలో, ఇతరత్రా అవసరాలకు పోయేవి. కానీ ఇప్పుడు కరోనా, వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇతరత్రా కారణాలతో ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో వినోదం, ఆనందం కోసం బయట చేసే ప్రతి పనినీ ఇంట్లో ఉంటూనే ఆస్వాదించాలనే అభిప్రాయానికి వచ్చారు.

అందుకే ఇంటిని, ఇంట్లోని ప్రతి వసతులను ఆధునికంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం బయట జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌కు వెళ్లే వారు ఇప్పుడు అవే వసతులు, ఔట్‌డోర్‌ జిమ్‌లను కల్పించే గేటెడ్‌ కమ్యూనిటీలను వెతుకుంటున్నారు. వీకెండ్స్‌లో సినిమాకు వెళ్లే బదులు.. ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ), నెట్‌ఫ్లిక్స్‌ వంటి వాటిల్లో ఇంట్లోనే థియేటర్‌ అనుభూతి కల్పించే హోమ్‌ థియేటర్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనాకు ముందు కంటే  హైఎండ్‌ నగరవాసుల వినియోగ వ్యయం తగ్గింది. దీనిని లగ్జరీ ఇంటీరియర్‌ కోసం వెచ్చిస్తున్నారు.  

విదేశాల నుంచి దిగుమతి... 
ఇటలీ, టర్కీ, ఈజిప్ట్‌ దేశాల నుంచి లిమిటెడ్‌ ఎడిషన్‌ ఇంటీరియర్స్‌ దిగుమతి అవుతున్నాయి. ఇంటీరియల్‌లో వినియోగించే ఉత్పత్తుల్లో 60 శాతం ఆయా దేశాల నుంచే దిగుమతి అవుతుంటాయని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ కే ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తలుపులు, డైనింగ్‌ టేబుల్స్, బెడ్స్, వాల్‌ పేపర్స్, కర్టెన్స్, మ్యాట్స్, లైట్లు, మార్బుల్స్, టైల్స్, ఫర్నిచర్, శాండిలియర్స్, బాత్‌ ఫిట్టింగ్స్, ల్యాండ్‌ స్కేపింగ్, పెయింటింగ్స్, శిల్పాలు.. ఇలా ప్రతి ఒక్కటీ దిగుమతి చేసుకుంటునన్నారు.

విభిన్న డిజైన్స్, లిమిటెడ్‌ ఎడిషన్‌ ఉత్పత్తులు దొరకడమే దిగుమతి చేసుకోవటానికి ప్రధాన కారణం. గతంలో హోమ్‌ డిజైనింగ్‌లో ఆర్కిటెక్ట్, ఇంటీరియర్‌ డిజైనర్‌ మాత్రమే భాగస్వామ్యమయ్యే వారు. కానీ, ఇప్పుడు శిల్పులు, చిత్రకారులు కూడా వీరితో జతకట్టి నివాసితులకు ఆధునిక అనుభూతిని కల్పించేలా గృహాలను తీర్చిదిద్దుతున్నారు. 

లిమిటెడ్‌ ఎడిషన్స్‌లలో కొన్ని బ్రాండ్లు... 
పలు లగ్జరీ కార్ల కంపెనీలు బెంట్లీ, పోర్షే వంటివి లిమిటెడ్‌ ఎడిషన్‌ ఇంటీరియర్‌ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాయి. ఇటలీకి చెందిన ఫెండి కాసా, జియోర్జెట్టి, రోబర్టో కావల్లీ, ట్రుసార్జీ కాసా, ఎట్రో హోమ్, జంబో, జియాన్‌ఫ్రాంకో ఫెర్రే హోమ్, న్యూయార్క్‌కు చెందిన రాల్ఫ్‌ లారెన్‌ హోమ్, యూకేకు చెందిన బెంట్లీ హోమ్, ప్యారిస్‌కు చెందిన బకారట్‌ లా మైసన్, ఫ్రాన్స్‌కు చెందిన రిట్జ్‌ పారిస్, బుగట్టీ హోమ్‌.. ఇవన్నీ అంతర్జాతీయ ఇంటీరియర్‌ బ్రాండ్లు. క్లాసిక్‌ స్టయిల్‌లో చేతితో తయారు చేస్తారు. నాణ్యత, డిజైనింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. 

నగరంలో లిమిటెడ్‌ ఎడిషన్‌ ఇంటీరియర్స్‌.. 
మైహోమ్, అపర్ణా, రాజపుష్ప, ముప్పా వంటి ప్రాజెక్ట్‌లతో నాలుగైదుగురితో పాటు జూబ్లిహిల్స్‌ రోడ్‌ నం.45, గచ్చిబౌలిలోని ఇద్దరు వ్యక్తిగత కస్టమర్లు పూర్తిగా టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న 24 క్యారెట్ల గోల్డ్‌ లీఫింగ్‌తో ఇంటీరియర్‌ చేయించుకున్నారు. గిరిధారి, ప్రణీత్, ఎస్‌ఎంఆర్‌ తదితర      సంస్థలు క్లబ్‌హౌస్‌లను విదేశీ ఇంటీరియర్‌ ఉత్పత్తులతో ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాయి.    సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నేతలు తమ గృహాలను    లిమిటెడ్‌ ఎడిషన్‌ ఇంటీరియర్‌తో రాజభవనాల లాగా తీర్చిదిద్దుతున్నారు. 

కార్మికులూ విదేశాల నుంచే.. 
ఈ తరహా ఇంటీరియర్స్‌ను ఇక్కడి కార్మికులు చేయలేరు. అందుకే ఈజిప్ట్‌ నుంచి ఇంటీరియర్‌ నిపుణులు వచ్చి డిజైనింగ్‌ చేస్తుంటారని తాయబా తెలిపారు. 10 వేల చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాలకు మాత్రమే ఈ తరహా లగ్జరీ ఇంటీరియర్స్‌ బాగుంటాయి. వీటి ధరలు చదరపు అడుగుకు రూ.800 నుంచి 4,500 వరకు ఉంటాయి. ప్రాజెక్ట్‌ మొత్తానికి రూ.5–10 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంటీరియర్‌ డిజైన్‌ పూర్తి చేసేందుకు 30–90 రోజుల సమయం పడుతుంది. 

కళ్లు తిరిగే ధరలు.. 
బెంట్లీ సోఫా. వీటి ప్రారంభ ధర రూ.30 లక్షల నుంచి ఉంటుంది. పోర్షే కిచెన్‌ సెట్స్‌ ప్రారంభ ధర రూ.కోటి నుంచి మొదలవుతుంది. 
అర్మానీ కాసా ఫర్నీచర్, టైల్స్‌. వీటిని ఆఫ్రికాలో పెరిగే కొన్ని అరుదైన రకాల వృక్షాల నుంచి ఈ ఫర్నీచర్‌ను తయారు చేస్తారు. వీటి ప్రారంభ ధర రూ.50 లక్షల పైమాటే. 
‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ అనే 30–40 ఏళ్ల నాటి అరుదైన వృక్షాలను ఆఫ్రికా దేశం నుంచి దిగుమతి చేసుకొని ల్యాండ్‌స్కేపింగ్‌గా వినియోగిస్తుంటారు.
 
జపాన్‌కు చెందిన టోటో, జర్మనీకి చెందిన నోకెన్‌ బాత్‌రూమ్‌ అండ్‌ శానిటైజ్‌ ఫిట్టింగ్స్‌లో గ్లోబల్‌ బ్రాండ్లు. ఆయా ఉత్పత్తుల ప్రారంభ ధరలు రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఆటోమెటెడ్‌ టాయిలెట్, షవర్స్, బాడీ జెట్స్‌ ఉత్పత్తులు వీటి ప్రత్యేకత. టాయిలెట్‌ పైన కూర్చుంటే చాలు వాతావరణాన్ని బట్టి ఆటోమెటిక్‌గా అదే నీటిని పంపింగ్‌ చేస్తుంది. శరీర ఉష్ణోగత్రను బట్టి మారుతూ ఉంటుంది. షవర్స్, బాడీజెట్స్‌ శ్రావ్యమైన మ్యూజిక్, లైటింగ్స్‌తో పైనుంచి వర్షం పడినట్లుగా వస్తుంటుంది. 
డెఫా లైటింగ్‌ సొల్యూషన్స్‌ మనిషి మూడ్‌ను, ఉష్ణోగ్రతను బట్టి గదిలో వెలుతురును ఇవ్వటం దీని ప్రత్యేకత. ప్రముఖ జువెల్లరీ బ్రాండ్‌ స్వరోస్క్వీ.. శాండిలియర్స్‌ను కూడా విక్రయిస్తుంది. వీటి ప్రారంభ ధర రూ.10 లక్షలు. 
అమెరికాకు చెందిన జేబీఎల్, డెన్మార్క్‌కు చెందిన డాలీ, డైనడియా, జపాన్‌కు చెందిన డినాన్, ఫ్రాన్స్‌కు చెందిన డెవిలెట్, ఫోకల్‌ వంటివి థియేటర్‌ అనుభూతిని కల్పించే హోమ్‌ థియేటర్స్‌ గ్లోబల్‌ బ్రాండ్లు. 

కరోనా కారణంగా ప్రయాణాలు కుదరడం లేదు 
రెసిడెన్షియల్, కమర్షియల్, ఇనిస్టిట్యూషనల్‌ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్‌ డిజైన్స్‌ చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు నగరాలలో 50–60 ప్రాజెక్ట్స్‌ ఆర్డర్లు ఉన్నాయి. కరోనా కారణంగా విదేశాలకు వెళ్లి ఇంటీరియర్స్‌ను ఎంపిక చేయడం కుదరటం లేదు. 
– జీ రామ్‌మోహన్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్‌ డిజైనర్‌  

ప్యాలెస్‌లు తీర్చిదిద్దడం మా ప్రత్యేకత 
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అహ్మదాబాద్‌ నగరాల్లో 55 వేల చదరపు అడుగులలో పలు ప్రాజెక్ట్‌ల ఆర్డర్లు ఉన్నాయి. టర్కీ, ఇటలీ రాయల్‌ ఫర్నిచర్‌తో లండన్, దుబాయ్, సౌదీ ప్యాలెస్‌ వంటి కాన్సెప్ట్‌లతో ఇంటీరియర్‌ను డిజైన్‌ చేయడం మా ప్రత్యేకత. పదేళ్ల వారంటీ కూడా ఉంటుంది. 
– తాయ్యబా, ఎండీ, బెనోయిట్‌ ఫర్నీచర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement