అస్వస్థతకు గురైన మహిళను తరలిస్తున్న పోలీసులు
కంచరపాలెం(విశాఖ ఉత్తర): జీవీఎంసీ 43వ వార్డు కంచరపాలెం పరిధి రాజీవ్‌కాలనీ వద్ద మంగళవారం వేకువజామున తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు రేకుల షెడ్లు తొలగించేందుకు యత్నించగా స్థానిక నివాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. జేసీబీతో ఇళ్లు తొలగిస్తున్న సమయంలో వాహనాలను తమపై నుంచి పోనివ్వాలని బైఠాయించారు. అయినప్పటికీ అధికారులు వెనక్కు తగ్గలేదు. రంగంలోకి దిగిన కంచరపాలెం, ఎయిర్‌పోర్ట్ జోన్ పోలీసులు బాధితులను చెదరగొట్టారు. ఇళ్ల తొలగింపును అడ్డుకునే క్రమంలో ఓ మహిళకు ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు హుటాహుటిన అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే... రాజీవ్‌కాలనీ ప్రాంతంలో ఉన్న సుమారు నాలుగు ఎకరాల రైల్వే స్థలంలో 275 కుటుంబాల వారు సిమెంటు రేకుల షెడ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. మురికివాడల అభివృద్ధిలో భాగంగా కాలనీలోని నివాసితులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. కాలనీ స్థలం రైల్వేకు సంబంధించినది కావడంతో స్థల మార్పిడిలో భాగంగా రాజీవ్‌కాలనీలో నివాసం ఉంటున్న సుమారు 65మందికి కొమ్మాది వద్ద నిర్మించే జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం హౌసింగ్ స్కీమ్‌లో కేటాయించారు.
మిగిలిన 210 కుటుంబాల ప్రజలకు రాజీవ్‌కాలనీ వద్ద జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇళ్లు నిర్మించేందుకు ఇటీవలే ఏపీ టీడ్కో సంస్థకు నిర్మాణ పనులు జీవీఎంసీ అప్పగించింది. ఇందులో భాగంగా వారం రోజుల నుంచి రాజీవ్‌కాలనీ ప్రాంతవాసులకు ఇక్కడి ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో షెడ్లు తొలగించామని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు.
టీడీపీ నాయకుల వల్లే
తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇళ్లను తొలగించారని, దీని వెనుక స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల హస్తం ఉంద ని, వారే తమకు అన్యాయం చేశారని నివాసితులు ఆరోపించారు. స్థానిక టీడీపీ నాయకులు ఇళ్ల కేటాయింపులో చేతివాటం ప్రదర్శిం చారని స్థానికురాలు పాడి కాంచన ఆరోపించింది. సక్రమంగా ఇంటి పన్నుతోపాటుగా కరెంటు బిల్లు చెల్లిస్తున్నామని.. అయినప్పటి కీ తమకు చెప్పకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇళ్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాలకు రోడ్డున పడ్డామని వాపోయారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తొలగింపు చర్యల్లో అర్బన్ తహసీల్దార్ నాగభూషణ్, పశ్చిమ జోన్ ఏసీపీ లంక అర్జున్, జీవీఎంసీ డీసీపీ రాంబాబు, వివిధ జోన్ల టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు మధుసూదనరావు, సత్యనారాయణ, నాయుడు, టీపీవోలు విజయ్‌కుమార్, శ్రీలక్ష్మి, ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు సూర్యనారాయణ, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment