ఆటోవాలా.. ఇలాగైతే దివాళా
సర్కారు తీరుపై ఆటోవాలాలు సమర శంఖం పూరించారు. ఆటో కార్మికుల్ని సంక్షోభంలోకి నెట్టివేసే 894 జీవో రద్దు కోరుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం ఆందోళనలకు దిగారు. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు.
కదం తొక్కిన ఆటో కార్మికులు
తణుకు అర్బన్: ఆటో కార్మిక రంగాన్ని కుదేలుచేసే 894 జీవో రద్దుకోరుతూ తణుకులో ఆటో కార్మికులు కదం తొక్కారు. ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్వోబీ నుంచి ప్రారంభమైన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా రవాణా శాఖ కార్యాలయం వద్దకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ముజుఫర్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మికుల పొట్టకొడుతున్నాని విమర్శించారు. ఇటీవల ఆటో వాహనాలపై విపరీతంగా ఫీజులు పెంచడంతో పాటు ఫిట్‌నెస్ చేయించుకోని ఆటోలపై రోజుకు రూ.50 అపరాధ రుసుం విధించేలా జీవోను తీసుకురావడం దారుణమన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోగా వారిని అప్పులపాలుచేసేలా జీవోలు తేవడం సరికాదన్నారు. ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పంగం రాంబాబు మాట్లాడుతూ జీవోల పేరుతో అధికారులు కార్మికులను వేధిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ తణుకు ఏరియా నాయకులు బొద్దాని నాగరాజు, వైస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు పీవీ ప్రతాప్, కేతా గోపాలన్, సబ్బిత లాజర్, పైబోయిన సత్యనారాయణ తదితరులు మట్లాడారు. అనంతరం మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ నెక్కంటి శ్రీనివాస్‌కు నాయకులు, కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు. తణుకు, తణుకు మండలం, ఉండ్రాజవరం, అత్తిలి, ఇరగవరం, పెరవలి, పెనుమంట్ర మండలాల నుంచి 30 యూనియన్లకు చెందిన ఆటో కార్మికులు భారీగా తరలివచ్చారు.