‘ఆటో’ రాణులు
‘ఆటో’ రాణులు
Published Sat, May 13 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM
త్వరలో ‘షీ’ ఆటోలు
– మెప్మా ఆధ్వర్యంలో 200 మంది మíßహిళలకు ఉపాధి
– 90 రోజుల పాటు మహిళలకు శిక్షణ
– ప్రయోగాత్మకంగా కర్నూలులో శ్రీకారం
కల్లూరు(రూరల్)/కర్నూలు(టౌన్): హైదరాబాద్ తరహాలో కర్నూలులోనూ షీ ఆటోలకు ప్రణాళిక సిద్ధమైంది. మహిళలు ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించే పరిస్థితి లేకపోవడం.. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలతో ఇళ్లకు చేరుకునేందుకు బిక్కుబిక్కుమనే పరిస్థితుల్లో తెరపైకి వచ్చిన షీ ఆటో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అనుమతితో కర్నూలులో ప్రయోగాత్మకంగా షీ ఆటోలు నడిపేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) శ్రీకారం చుడుతోంది. శిక్షణను ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించే దిశగా వేస్తున్న ఈ అడుగు ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపనుంది.
మహిళల రక్షణే ధ్యేయంగా..
మగ వారికే పరిమితమైన ఆటో రంగంలో రాణించేందుకు మహిళలు కూడా ముందుకొస్తున్నారు. కర్నూలు నగరంలో 20వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఉపాధి పేరిట ఆటోలు నడుపుతున్న కొందరు డ్రైవర్లు మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. ఇందుకు జిల్లాలోని ఆయా పోలీసుస్టేషన్లలో నమోదవుతున్న కేసులో ఉదాహరణలు. రెండేళ్ల క్రితం కర్నూలు నగరానికి చెందిన రవికుమార్ అనే ఆటో డ్రైవర్ మహిళలకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడడం, దోచుకోవడం వంటి ఘనలతో ఆటో డ్రైవర్లు అంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. చీకటి పడితే మహిళలు ఒంటరిగా ఆటోలో ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు భరోసాగా షీ ఆటోలను మెప్మా తెరపైకి తీసుకొచ్చింది.
200 మందికి ఉపాధి.. 90 రోజుల పాటు శిక్షణ
‘షీ’ ఆటోల పేరుతో పొదుపు గ్రూపుల్లో మహిళలను 200 మందిని ఎంపిక చేసి డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. 90 రోజుల పాటు శిక్షణనిచ్చి ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణం సైతం అందిస్తారు. మొదట 100 మంది మహిళలకు ఉచిత వసతి, భోజనంతో పాటు ఆటో డ్రైవింగ్ నేర్పించి ఆ తర్వాత మరో వంద మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ‘షీ’ ఆటోలతో అనుసంధానం చేసి నిరంతరం ఉపాధి కల్పించేందుకు మెప్మా అధికారులు నివేదికలు రూపొందించారు. విద్యార్థులను స్కూళ్ల వద్ద వదిలిపెట్టడం.. ఆ తర్వాత తిరిగి ఇళ్లకు చేర్చడం ద్వారా ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. మిగతా సమయంలో నగరంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి నెలకు కనీసం రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదించే వెసులుబాటు కల్పించనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పొదుపు మహిళలను ఎంపిక చేసి బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పించడం.. నెలసరి వాయిదాల రూపంలో తిరిగి చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నారు.
‘షీ’ఆటోలకు త్వరలో శ్రీకారం
పొదుపు గ్రూపు మహిళలచే షీ ఆటోలను త్వరలో నడుపుతాం. మహిళలకు శిక్షణనిచ్చి రుణం ద్వారా ఆటోలను పంపిణీ చేస్తాం. ఇందుకోసం సోమవారం జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోనున్నాం. 200 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తాం.
Advertisement
Advertisement