బహిరంగ విమర్శలు మానుకోండి
బహిరంగ విమర్శలు మానుకోండి
Published Mon, Nov 21 2016 9:31 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
– భూమా, శిల్పాల మధ్య రాజీకి అచ్చెన్న యత్నం
– నాలుగు నియోజకవర్గాల్లో విభేదాలు వాస్తవమే
కర్నూలు/నంద్యాల: పార్టీకి నష్టం కలిగించేలా బహిరంగ విమర్శలు మానుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పార్టీ ఇన్‌చార్జి శిల్పా మోహన్‌రెడ్డిలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. టీడీపీ జన చైతన్యయాత్ర కార్యక్రమాల్లో భాగంగా బేతంచెర్ల, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ఆదివారం రాత్రి నగరంలోని మౌర్యా ఇన్‌లో బస చేశారు. సోమవారం ఉదయం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణి రెడ్డి, ఆయన సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు ఏవీ సుబ్బారెడ్డిని పిలిపించి రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. పార్టీ మారినప్పటి నుంచి భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డిలు పరస్పరం దూషించుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఇరువురినీ పిలిపించి రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గీయులు బహిరంగ విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని నచ్చజెప్పినట్లు సమాచారం. ఇరువురి మధ్య సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని.. లేదా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై పరిష్కరించుకోవాలని సూచించారు. గోడదూకిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్న మాట వాస్తవమేనని ఈ సందర్బంగా మీడియాతో ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అంగీకరించారు. కోడుమూరు, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జనచైతన్య యాత్ర కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించుకుంటున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకురాగా వాస్తవమేనని.. త్వరలో అవన్నీ పరిష్కారం అవుతాయన్నారు.
Advertisement