పెద్దాపురం : జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీల్లో పెద్దాపురం మండలం చదలాడ గ్రామానికి చెందిన కోడిగుడ్డు శ్రీరామ్ ఇటీవల చిత్రీకరించిన నో ఎండ్ లఘు చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. గత ఏడాది మండలంలోని చదలాడ, పరిసర ప్రాంతాలు, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని నూతన నటీనటులతో కోడిగుడ్డు త్రిమూర్తులు, అరవపల్లి శ్రీను, అత్తిలి నాగబాబు నిర్మాతలుగా రూపొందించారు.
లఘు చిత్రానికి కథానాయకుడిగా శివ, కథానాయికగా హైదరాబాద్‌కు చెందిన నాగభార్గవిలు నటించగా నటులు సానా నూకరాజునాయుడు, రవి సబ్బసాని తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఇటీవల యూఆర్ ఫిల్మ్స్ (హైదదాబాద్) వారు నిర్వహించిన జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీల్లో ఈ చిత్ర హీరోయిన్ నాగభార్గవికి జాతీయ స్థాయి అవార్డు లభించింది.
దీంతో చిత్రబృందం సోమవారం మండలంలోని చదలాడలో సందడి చేసుకుంది. దర్శకుడు శ్రీరామ్ విలేకర్లతో మాట్లాడుతూ మొదటి ప్రయత్నంలో తమ చిత్రానికి జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. నటి భార్గవి మాట్లాడుతూ ఈ క్రెడిట్ దర్శకుడు శ్రీరామ్‌కే చెందుతున్నారు. అనంతరం చిత్ర బృందాన్ని గ్రామ పెద్దలు రాగాల ఉమామహేశ్వరరావు, సర్పంచ్ మాణిక్యాంబ, ఎంపీటీసీ కోట శ్రీనివాసరావు అభినందించారు.