
అనర్థాలపై చైతన్యం అవసరం
► బాల్యవివాహాలపై కలెక్టర్ దివ్య, ఎస్పీ అన్నపూర్ణ
► బాలికా విద్యను ప్రోత్సహించాలని పిలుపు
► భరోసా కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్
► వర్క్‌షాప్‌లో సలహాలు, సూచనలు
సాక్షి, వికారాబాద్: బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తే.. వీటి నియంత్రణ సాధ్యమవుతుందని కలెక్టర్ దివ్య, ఎస్పీ అన్నపూర్ణ అభిప్రాయపడ్డారు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బాల్యవివాహాల నివారణ, అనర్థాలపై తీసుకోవాల్సిన చర్యలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహం జరిపే విషయాన్ని గ్రామపెద్దలకు తెలుస్తుంది కాబట్టి వారు బాధ్యతను గుర్తెరిగి ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాలబాలికలకు ఎన్నో రంగాల్లో అవకాశాలుంటాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కస్తూర్బా గురుకులాల్లో హెల్ప్‌లైన్ ద్వారా వారి భవిష్యత్తు మార్గదర్శకాలను ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. గొట్టిముక్కులలో బాలికల విద్యకు పాటుపడుతూ బాల్యవివాహాల నిర్మూలనకు తీసుకున్న చర్యలపై ఆ గ్రామ సర్పంచ్ అరుణను కలెక్టర్ అభినందించారు. జిల్లా ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ..బాల్యవివాహాల నిర్మూలనకు తమ శాఖ తరఫున శాయశక్తులా కృషిచేస్తామన్నారు. బాల్యవివాహాలు జరిపినట్లు తమ దృష్టికి తీసుకువస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా సంబందీకులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తామని తెలిపారు. త్వరలో ఏర్పాటు చేసే భరోసా కేంద్రంలో మహిళా హోంగార్డు, కౌన్సిలర్లతో పా టుగా మానసిక వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంచే విషయాన్ని పరి శీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ సురేష్ పొద్దార్, జిల్లా మహిళా సం క్షేమ అధికారి జ్యోత్స్న, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్. ఎస్ గాలబ్, ప్రొఫెసర్లు పృథ్వీకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, చైల్డ్‌లైన్ జిల్లా కో–ఆర్డినేటర్ వెంకటేష్, సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, పోలీసు అధికారులు, పలుగ్రామాల సర్పంచులు,కార్య దర్శులు, వీఆర్వోలు, చైల్డ్‌లైన్, మహితా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రత్యేక చొరవ చూపాలి
బాలికల విద్యను ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో ప్రత్యేకంగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా బాల్య వివాహాలను అరికట్టవచ్చు. విద్యార్థినులు కళాశాల విద్యను అభ్యసించడానికి కళాశాలలు అందుబాటులో లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు ఉండకపోవడంతో బాల్యంలోనే తల్లిదండ్రులు వారికి వివాహాలు జరిపిస్తున్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. ఈ వివాహాల వల్ల కలిగే అనర్థాలను బాలికల తల్లిదండ్రులకు తెలియజేయడానికి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ ప్రత్యేకంగా చొరవ చూపాలి.
–కలెక్టర్ దివ్య