- నేటి నుంచి జీఎస్టీ అమలు
- వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు రద్దు
- పెట్రోల్, డీజిల్, ఆల్కాహాల్‌కు వినహాయింపు
- ఇప్పుడున్న పన్నులు శాశ్వతం కాదన్న
వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్
- ‘సాక్షి’ సదస్సుకు విశేష స్పందన
కర్నూలు(హాస్పిటల్): జూలై ఒకటో తేదీ నుంచి ఒకే దేశం...ఒకే పన్ను పేరుతో దేశవ్యాప్తంగా జీఎస్టీ(వస్తుసేవల పన్ను) అమలు కానుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. ఇందులో భాగంగా శనివారం స్థానిక పాతబస్టాండ్ సమీపంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రజలు, ప్రజా సంఘాలు, వ్యాపారులు, వాణిజ్యవర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికున్న సందేహాలను వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జె.తాతారావు నివృత్తి చేశారు.
పన్ను చెల్లించే విధానాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్ వివరించారు. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ సుబ్బారావు, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకరరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి రసూల్, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాయకల్లు సోమసుందరం, ఏపీ గ్రానైట్స్ ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యంగౌడ్, పారిశ్రామిక వేత్తలు సి.నాగిరెడ్డి, బైసానిరాజు, ఎంఎస్‌ఎఫ్ నాయకులు గోపి, సుధాకర్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడున్న పన్నులు శాశ్వతం కాదు –జె.తాతారావు, డిప్యూటీ కమిషనర్ వాణిజ్యపన్నుల శాఖ
జీఎస్టీపై కొంత మంది వర్తకుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడున్న పన్నులు శాశ్వతంగా ఉండవు. ఇప్పటికే అనేక మంది ఇచ్చిన విన్నపాల మేరకు కమిటీ పరిశీలించి సవరణలు చేసింది. తరచూ కమిటీ సవరణలు చేస్తూనే ఉంటుంది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, వినతులను ప్రభుత్వానికి నివేదిస్తాం. కొన్ని రకాల వస్తువుల ధరలు ఉత్పత్తి, డిమాండ్ ఆధారంగా ఉంటాయి. వాటిపై జీఎస్టీ ప్రభావం ఉండదు. గ్రానైట్, ఫర్నిచర్‌లపై వేసిన జీఎస్టీపై కమిటీ పరిశీలన చేస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్‌ను సైతం జీఎస్టీ పరిధిలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న టిన్ నెంబర్ స్థానంలో జీఎస్టీవస్తుంది.
చైతన్యవంతం కావాలి –వెంకటేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్, వాణిజ్యపన్నుల శాఖ
వినియోగదారులు చైతన్యవంతం కావాలి. ప్రతి కొనుగోలుపై తప్పనిసరిగా జీఎస్టీతో కూడిన బిల్లును తీసుకోవాలి. దీనివల్ల పన్నుల వ్యవస్థ పటిష్టమవుతుంది. జీఎఎస్టీ వల్ల వస్తువుల ధరలు పెరుగుతాయనే ప్రశ్నే ఉండదు. ప్రతి స్టేజీలో అంతకుముందు చెల్లించిన పన్ను ఇన్‌పుట్‌గా తిరిగి వ్యాపారులకు వస్తుంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ, స్థానిక సంస్థల వినోదపుపన్ను, ఆల్కహాలు వంటి వాటికి మినహాయింపు ఇచ్చారు.
ఇతర దేశాల్లో తక్కువ –ఐ.విజయకుమార్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు
ఇతర దేశాల్లో జీఎస్టీ తక్కువగా ఉంది. ఫర్నిచర్‌పైన ఇప్పుడున్న పన్ను 5 శాతం నుంచి 18శాతానికి పెంచారు. దీనివల్ల ధరలు పెరిగి కొనుగోళ్లు తగ్గిపోతాయి. కేంద్రం.. మంచి చేస్తున్నామని చెబుతూనే పన్నులు పెంచుతోంది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి –హఫీజ్‌ఖాన్, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త
జీఎస్టీపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వీటిని అధికారులు.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. ప్రజల విజ్ఞప్తులు పరిగణనలోకి తీసుకుని పన్నులు తగ్గించాలి.
అరుణ్‌జైట్లీకి విన్నవించాం –నక్కల మిట్ట శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి
జీఎస్టీపై ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై ఫిట్‌మెంట్ కమిటీ వేశారు. పన్నులు సైతం మారుస్తున్నారు. నేను కూడా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి పన్నులు తగ్గించాలని విన్నవించాను.